
వైసీపీ శాసనసభ్యురాలు రోజా అంటే చంద్రబాబునాయుడు ప్రభుత్వం భయపడుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు హాజరయ్యేందుకు శనివార ఉదయం వైసీపీ ఎంఎల్ఏ రోజా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అదే సమయంలో దలైలామా విమానాశ్రయానికి వస్తున్నారంటూ పోలీసులు రోజును ఏర్ పోర్టులాంజ్ లో ఉన్న ఓ గదిలో కూర్చోబెట్టారు. దాదాపు గంటన్నరైనా గదిలోనుండి రోజాను బయటకు రానీయలేదు పోలీసులు. అదేమంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.
దాంతో తనను గదిలోనే నిర్బంధించారన్న విషయం రోజాకు అర్ధమైపోయింది. సదస్సుకు హాజరయ్యేందుకు తాను వచ్చానని, తనకు స్పీకర్ కార్యాలయం పంపిన పాస్ చూపినా పోలీసులు రోజాను వదలేదు. సహనం నశించిన రోజా పోలీసులతో పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగారు. దాంతో చేసేదిలేక పోలీసులు రోజాను వాహనంలోకి ఎక్కించారు. అయితే, వాహనాన్ని విజయవాడకు కాకుండా గుంటూరు వైపు తరలించారు. దాంతో వాహనంలో నుండే రోజా పెద్ద ఎత్తున కేకలు వేయటంతో చూసిన వారెవరో విషయాన్ని వైసీపీ నేతలకు చేరవేసారు. దాంతో వ్యవహారం రచ్చకెక్కింది.
మహిళా సాధికారతపైన సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వం వైసీపీ మహిళా ఎంఎల్ఏ రోజాను నిర్బంధించటమేమిటో అర్ధం కావటం లేదు. ఓ వైపు మహిళల సాధికారత గురించి మాట్లాడుతూనే మరోవైపు మహిళ నోరు నొక్కేస్తుండటం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లింది. అసలు, రోజా అంటేనే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందో అర్ధం కావటంలేదు. సదస్సుకు వైసీపీ మహిళా ప్రతినిధులను రానీయకూడదని అనుకున్నపుడు అసలు ఎందుకు పిలిచింది? ఇదే విషయమై రోజు, వైసీపీ నేతలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. సదస్సుకు హాజరుకానీయకుండా పోలీసులే రోజాను కిడ్నాప్ చేసారంటున్న వైసీపీ నేతలు మాటలకు ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాలి.