
విశాఖపట్నం: పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు షాక్ తగిలింది. వంగలపూడి అనితకు మళ్లీ టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటంతో ఆమె వ్యతిరేక వర్గం నిరసనలకు దిగింది.
అనిత తీరును నిరసిస్తూ ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సైకిల్ వీడి వైసీపీ గూటికి చేరారు. తాజాగా మరికొంతమంది నేతలు ఆందోళనకు దిగారు. మహిళా సర్పంచులు, మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల సమక్షంలో మహిళలు ర్యాలీని నిర్వహించారు.
స్థానిక ఎమ్మెల్యే అనితకు టీడీపీ టికెట్ కేటాయించవద్దని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనిత ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న తరుణంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవ్వడంతో వంగలపూడి అనిత వర్గం ఖంగుతింది. మెుత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు ఇలా బట్టబయలు కావడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.