పాపం పండింది: 1998లో కిడ్నాప్..20 ఏళ్ల తర్వాత మాయలేడి అరెస్ట్

By Siva KodatiFirst Published Aug 25, 2019, 3:40 PM IST
Highlights

పాపం పండినప్పుడు ఎంతటి వాడైనా విధి ముందు తలవంచక తప్పదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా రెండు దశాబ్ధాల పాటు తప్పించుకుని తిరిగిన ఓ మాయలేడీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది

పాపం పండినప్పుడు ఎంతటి వాడైనా విధి ముందు తలవంచక తప్పదు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా రెండు దశాబ్ధాల పాటు తప్పించుకుని తిరిగిన ఓ మాయలేడీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది.

వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మీ అనే మహిళ 20 ఏళ్ల క్రితం విజయనగరం జిల్లా వంగపల్లిపేట నివసిస్తుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మండల సూర్యారావు, పెంటమ్మ దంపతుల నాలుగేళ్ల కుమారుడు శంకరరావును 1998 మార్చి 8న భాగ్యలక్ష్మీ కిడ్నాప్ చేసింది.

అంతేకాకుండా సూర్యారావు ఇంట్లోంచి రూ.15 వేల నగదు, ఆరున్నర తులాల బంగారాన్ని సైతం ఎత్తుకెళ్లింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏళ్ల తరబడి విచారణ జరిగినా.. మాయలేడితో పాటు బాలుడి ఆచూకీ సైతం లభ్యం కాలేదు. దీంతో కేసును మూసివేశారు. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మీ జియమ్మవలసలో ఓ వ్యక్తికి వలవేసి అతని ఇంట్లో చేరింది... ఓ రోజు బంగారాన్నంతా మూటగట్టుకుని పారిపోతుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

విచారణలో ఈమె నేరచరిత్ర మొత్తం వెలుగు చూసింది. జియమ్మవలసలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న లోపింటి రామకృష్ణ భాగ్యలక్ష్మీని గుర్తించడంతో 20 ఏళ్ల కేసు బయటపడింది.

బాలుడు కిడ్నాపైన కేసును దర్యాప్తు చేసిన బృందంలో అతను సభ్యుడు. కాగా.. బాలుడి కిడ్నాప్ చేసింది తానేనని ఒప్పుకున్న భాగ్యలక్ష్మీ విచారణలో పొంతన లేకుండా సమాధానాలు చెబుతోంది.

బాబు 16 ఏళ్ల వరకు తనతోనే ఉన్నాడని ఒకసారి... హైదరాబాద్‌లోని తన బావ దగ్గర ఉన్నాడని మరోసారి... ఎక్కడున్నాడో తెలియదని ఒకసారి చెబుతోంది.

రెండు దశాబ్ధాలుగా తమ బిడ్డ తిరిగొస్తాడని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నామని... ఇప్పటికైనా తమ కొడుకు ఆచూకీ కనిపెట్టాలని బాలుడి తల్లి వేడుకుంటోంది. అయితే కేసును తిరిగి తెరిచేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించామని.. త్వరలోనే బాలుడి ఆచూకీ కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. 

click me!