బిడ్డను చంపుకోవాలంటే బాధగా ఉంది.. బిడ్డతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..

By AN TeluguFirst Published Dec 17, 2020, 11:39 AM IST
Highlights

ఒంగోలులో ఓ తల్లి తన పదకొండు నెలల బిడ్డతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసులో కుటుంబకలహాలే ఈ దారుణానికి కారణమని తేలింది. స్థానిక రంగారాయుడు చెరువులో దూకి ఓ తల్లి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. 

ఒంగోలులో ఓ తల్లి తన పదకొండు నెలల బిడ్డతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ కేసులో కుటుంబకలహాలే ఈ దారుణానికి కారణమని తేలింది. స్థానిక రంగారాయుడు చెరువులో దూకి ఓ తల్లి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. టబుధవారం ఉదయం 11 గంటల సమయంలో రంగారాయుడు చెరువు సమీపంలో ఓ తల్లి తన బిడ్డను ఆడిస్తూ స్థానికులకు కనిపించింది. కాసేపటికే ఆమె తన 11 నెలల బిడ్డను పొట్టకు చున్నీతో కట్టుకుని నీటిలోకి దూకింది. ఎదురుగా ఉండే అపార్టుమెంట్లోని ఓ మహిళ చూసి సమీపంలో వాకింగ్‌ చేస్తున్న యువకుడికి పెద్దగా కేకలు వేసి చెప్పింది. 

ఆ యువకుడు తనకు ఈతరాదని పోలీసులను తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు విషయం పోలీసులకు తెలిసి 2.10 గంటలకు సంఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే తల్లి, బిడ్డ మృతదేహాలు నీటిపై తేలాయి. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా విషయాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. 

గంట వ్యవధిలోనే మృతురాలి సోదరుడు, తల్లి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సుమారు రెండేళ్ల క్రితం ఒంగోలు గోపాల్‌నగర్‌ మొదటి లైనుకు చెందిన ఉలిచి విజయమ్మ కుమార్తె కమలను నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరిగొండకు చెందిన చిల్లకూరు అఖిలేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. 

వీరికి ఏడో నెలలోనే బాబు జన్మించాడు. వీరితోపాటు అఖిలేష్‌ తల్లి, అమ్మమ్మ కూడా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో కమలకు వారితో మనస్పర్థలు వచ్చాయి. భర్త అఖిలేష్‌తో వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతడు ససేమిరా అన్నాడు. 

చివరకు ఆమె అలిగి పుట్టింటికి వస్తుంటే కన్న బిడ్డను కూడా వారి వద్దే ఉంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు అక్కడి పోలీసులు జోక్యం చేసుకుని బిడ్డను తల్లికి అప్పగించారు. అనంతరం దంపతుల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి పలు పర్యాయాలు పెద్ద మనుషులు, పోలీసుల ద్వారా పుట్టింటి వారు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 

40 రోజులుగా పుట్టింటి వద్ద ఉంటున్న ఆమెకు భర్త వైపు నుంచి వేరు కాపురానికి సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. తీవ్ర మనస్తాపం చెంది కమల అఘాయిత్యానికి పాల్పడింది. కమల తన ఆవేదనను ఆత్మహత్యకు ముందు డైరీలో రాసింది. తల్లి విజయమ్మ, అన్న సిద్ధార్థలు తనను ఎంత ప్రేమగా చూసుకునేవారో పేర్కొంది. నా మరణాన్ని త్వరగా మర్చిపోవాలని, పెళ్లి చేసుకుని వదినను నాకంటే బాగా చూసుకోవాలని కోరింది. 

అమ్మా.. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సిందని, అత్తింటికి వెళ్లి అక్కడ నరకయాతనను ఊహించుకోవాలంటేనే కన్నీళ్లు ఆగడం లేదంటూ బాధను వ్యక్త పరిచింది. నా బిడ్డను నేను చంపుకోవాలంటే బాధగానే ఉందని, వదిలేస్తే పెద్దయ్యాక నేను ఒంటరిని చేసి వెళ్లాననే బాధ నా బిడ్డకు ఉండకూడదని, అందుకే ధైర్యం చాలకున్నా నా బిడ్డను నాతోటే తీసుకెళ్తున్నా.. అంటూ పేర్కొంది. 

నా మరణాన్ని అవమానకరంగా చూడొద్దని, మనం ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని వారిని వదిలేయాలని అత్తింటి వారిని ఉద్దేశించి తన తల్లిని, అన్నను కమల డైరీలో కోరింది. అంతేకాకుండా తన అంత్యక్రియలు అన్న సిద్దు చేతుల మీదుగానే జరగాలని. తన పేరును కూడా ఉలిచి (పుట్టింటి పేరు) కమలగానే చూడాలంటూ కోరింది. ఒన్‌టౌన్‌ సీఐ సీహెచ్‌ సీతారాం మాట్లాడుతూ కమల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిందని తెలిసిందని, డైరీని సీజ్‌ చేస్తున్నామని, పూర్తి విషయాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

click me!