
గుంటూరు : దగ్గరి బంధువుల చేతిలో మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ ఓ మహిళా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగింది. తనకు జరిగిన అన్యాయం గురించి సీఎంకు తెలిపి న్యాయం చేయాలని కోరేందుకు ఆమె తాడేపల్లి సీఎం క్యాంప్ ఆపీస్ కు వెళ్లింది. కానీ గేటు వద్దే ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో గేటువద్దే ఆందోళనకు దిగిన ఆమె పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నరసాపురంకు చెందిన శారదాదేవి భర్త చనిపోయాడు. ఉపాధి నిమిత్తం కొడుకులు హైదరాబాద్ లో వుండటంతో ఆమె ఒంటరిగా వుంటోంది. అయితే శారదాదేవి పేరిట వున్న కోట్ల విలువైన ఆస్తిని సొంత బంధువులు కాజేయాలని చూస్తున్నారట. ఆన్ లైన్ లో పేర్లు మార్చి ఇప్పటికే రెండెకరాల భూమిని కోటి యాబై లక్షలకు అమ్మేసుకున్నారని శారదాదేవి ఆవేదన వ్యక్తం చేసారు.
వీడియో
తన ఆస్తిని బావ కుటుంబసభ్యులు కాజేయాలని చూస్తున్నారని చాలాసార్లు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితంలేకుండా పోయిందని శారదాదేవి పేర్కొన్నారు. పేదరికంతో తన బిడ్డలు హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారని... అద్దె ఇళ్లలో వుంటున్నారని ఆమె తెలిపారు. కానీ తమ ఆస్తిని కాజేసిన బావ కుటుంబం మాత్రం అదే హైదరాబాద్, బెంగళూర్ లలో ఆస్తులు కొంటోందని శారదాదేవి అన్నారు.
Read More వృద్దుల పించన్ డబ్బులతో జూదమాడి... అడ్డంగా బుక్కయిన వాలంటీర్
అధికారులు తమకు న్యాయం చేయలేదు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రికి తమ బాధలు చెప్పుకోడానికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. కానీ సీఎంను కలవకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శారదాదేవి ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికయినా అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు శారదాదేవి కోరుతోంది.
ముఖ్యమంత్రి క్యాంప్ ఆపీస్ వద్ద పెట్రోల్ పోసుకోని ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించిన శారదాదేవిని అడ్డుకున్న పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపు ఆమెను స్టేషన్ లోనే వుంచి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టారు.