బాబోయ్.. వాషింగ్ మెషీన్ వృథానీరు ఇంటిముందుకు వస్తుందని.. మహిళను రాళ్లతో మోది హత్య...

By SumaBala BukkaFirst Published Dec 6, 2022, 1:24 PM IST
Highlights

చిన్న విషయంలో చెలరేగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. వాషింగ్ మెషీన్ నీళ్లు ఇంటిముందుకు వస్తున్నాయని ఓ మహిళను పొరుగువారు దారుణంగా హతమార్చారు. 

కదిరి : చిన్న చిన్న విషయాల్లో జరిగే గొడవలు ఒక్కోసారి దారుణానికి దారి తీస్తుంటాయి. అలాంటి ఓ చిన్న గొడవే ఓ మహిళ ప్రాణం మీదికి తెచ్చింది. మరికొంతమందిని నేరస్తులుగా మార్చింది. వాషింగ్ మిషన్ నుంచి వచ్చిన నీటి కారణంగా ఏర్పడిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. పక్కనున్న రెండు కుటుంబాల మధ్య వాషింగ్ మెషిన్ నుంచి బయటికి వచ్చినా వేస్ట్ వాటర్ విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడికి దిగాయి. దీంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన  వివరాల్లోకి వెళితే.. పద్మావతి అనే మహిళ కదిరి పట్టణంలోని మశానం పేటలో నివాసముంటోంది.  

ఆమె ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది. దాని నుంచి వచ్చే వృధా నీరు పక్కింటి ముందుకు వెళ్ళేది. పక్కింట్లో ఉన్న వేమన్న నాయక్ కుటుంబానికి వీరికి ఈ విషయంలో తరచూ గొడవ జరుగుతుండేది. అలాగే, ఆ రోజు కూడా రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు దారుణానికి తెగించారు.  పద్మావతిపై బండరాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. 

సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన రద్దు.. కారణమిదే..

గొడవకు అక్కడ చేరిన చుట్టుపక్కలవారు పరిస్థితి విషమించిందని గమనించి.. ఇరువర్గాలను ఆపి.. పద్మావతిని  వెంటనే కదిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. విషయం పోలీసులకు సమాచారం అందించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మావతి  పరిస్థితి  విషమంగా ఉంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను బెంగళూరుకు తరలించారు. అక్కడి ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ పద్మావతి మృతి చెందింది. దీంతో ఘర్షణ కేసు కాస్తా.. మర్డర్ కేసు గా మారింది. దీనిమీద కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత, గార్ల మండల వైస్ ఎంపీపీ రామశేషును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ బయట ఆయన వాకింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో దుండగులు కాపుకాచి హతమార్చారు. దాడికి పాల్పడింది ముగ్గురు నిందితులుగా తెలుస్తోంది. వీరు పల్సర్ బైక్ మీద వచ్చారని సమాచారం.

వాకింగ్ చేస్తున్న రామశేషును కత్తితో మెడమీద దాడిచేసి హత్య చేశారు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రామశేషు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలియగానే వెంటనే కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయనను చూసి వారి రోదనలు మిన్నంటాయి. హత్య సమాచారం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించి.. హత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. వాకింగ్ చేస్తున్న సమయంలో దుండగులు చెలరేగడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలిసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర్ నాయుడు, స్థానిక వైసీపీ నేతలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య విషయం మీద వీరు కూడా ఆరా తీస్తున్నారు. 

click me!