మహిళా ఎస్ఐ ఆత్మహత్య..!

By telugu news teamFirst Published Aug 30, 2021, 8:52 AM IST
Highlights

భవాని డిగ్రీ పూర్తయ్యాక స్వశక్తితో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించింది. 2018 బ్యాచ్‌కి చెందిన భవాని ఎస్‌ఐగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌లో చేరారు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.
 

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మహిళా ఎస్ఐ భవాని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీసు అధికారుల హాస్టల్ లో ఆమె ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఆదివారం సఖినేటిపల్లిలో విధుల్లో చేరాల్సి ఉంది. ఎస్‌ఐ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, నాగేశ్వరమ్మ దంపతులకు కుమార్తె భవానీ, కుమారుడు శివశంకర్‌ ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తండ్రి శ్రీనివాసరావు అనారోగ్యంతో ఇప్పటికే మృతి చెందారు. తల్లి నాగేశ్వరమ్మ పిల్లలిద్దరినీ కూలి పనులు చేసుకుంటూ చదివించింది. భవాని డిగ్రీ పూర్తయ్యాక స్వశక్తితో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించింది. 2018 బ్యాచ్‌కి చెందిన భవాని ఎస్‌ఐగా తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి పోలీసుస్టేషన్‌లో చేరారు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.

 శనివారం శిక్షణ ముగించుకున్న ఆమె... సింహాచలం వెళ్లి స్వామిని దర్శించుకుని విధుల్లో చేరతానని తన తోటి సిబ్బందితో చెప్పింది. పోలీసు అధికారుల హాస్టల్‌ ఉన్న భవాని ఆదివారం ఉదయం ఎంతకీ గది నుంచి బయటకు రాలేదు. ఎన్నిసార్లు తలుపుకొట్టినా తీయకపోవడంతో కిటికీ తెరిచిన సిబ్బందికి ఫ్యానుకు ఉరేసుకొని ఉన్న భవానిని గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌, వన్‌టౌన్‌ సీఐ మురళీ, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి తలుపులు తెరిపించారు. అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

click me!