సొంత నియోజకవర్గంలో మంత్రి బుగ్గనను ప్రశ్నించిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో..

By Sumanth KanukulaFirst Published Aug 1, 2022, 2:07 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. ఓ మహిళ నుంచి ఆయన నిరసన ఎదుర్కొవాల్సి వచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే ఊహించని పరిణామం ఎదురైంది. ఓ మహిళ నుంచి ఆయన నిరసన ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాలు.. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని 30వ వార్డులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. డోర్ టూ డోర్ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించడం మొదలుపెట్టారు. అయితే ఓ మహిళ.. తమకు ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని మంత్రి బుగ్గనను నిలదీసింది. దీంతో మంత్రి ప్రభుత్వం నుంచి ఆ మహిళకు అందిన సాయం గురించి వివరించగా..  తమ డబ్బులు తీసుకుని తమకే ఇస్తున్నారని అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 

టైలర్లకు ఇచ్చే సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పటివరకు డబ్బు పడలేదని మాధవి అనే మహిళ మంత్రి బుగ్గన దృష్టికి తీసుకెళ్లింది. ఉన్నోళ్లకే అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పుకొచ్చింది. తన పిల్లలు వేరే చోట ఉద్యోగం చేస్తున్నారని.. జగనన్న ఉద్యోగం ఇచ్చి ఉంటే పిల్లలు బయటకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. దీంతో మంత్రి బుగ్గన వెంటనే అక్కడి వారి దగ్గర ఉన్న వివరాలు సేకరించి.. ‘‘మీ కుటుంబానికి 98 వేల రూపాయలు వచ్చాయి కదమ్మా’’ అని చెప్పారు. సాయం అందలేదని ఎలా చెబుతావమ్మా అని అడిగారు. దీనిపై స్పందించిన మాధవి.. లక్ష ఇచ్చి రెండు లక్షల రూపాయలు లాగుతున్నారని కామెంట్ చేశారు. ‘‘మా డబ్బు తీసుకుని మాకే ఇస్తున్నారు’’ అని ప్రశ్నించారు. 

అనంతరం ఆమె వద్ద కు వచ్చి వైసీపీ నేతలతో మాధవి మాట్లాడుతూ.. జగన్ ఉద్యోగాలు ఇస్తానని చెబితే తాము టీడీపీ వాళ్లమైనా.. వైసీపీకి ఓటేశామని తెలిపింది. తమ కుటుంబంలోని మూడు ఓట్లు వైసీపీకే వేశామని చెప్పింది. ఏ పథకం ఇవ్వాలన్న కులం, మతం, వర్గం చూడామని చెప్పారని.. కానీ ఇప్పుడు అవన్నీ చూస్తున్నారని మండిపడింది. 

click me!