
తెనాలి : ఓ మహిళ తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అతి దారుణంగా హతమార్చింది. నిత్యం తాగేసి వేధిస్తున్నాడన్న కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన తెనాలి మండలంలోని కఠేవరం కాలువ కట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెనాలి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇలా తెలిపారు. గద్దె రాము (28), తన్నీరు ఆమని అనే ఇద్దరు గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గద్దె రాము కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తాడు. ఆమని భర్త నుంచి విడిపోయింది.
వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రాముకు పెళ్లి కాలేదు. కఠెవరం కాలువపై ఉన్న చిన్న రేకుల షెడ్డును అద్దెకి తీసుకుని రెండేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమని ఇళ్లల్లో పనులు చేస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఆమని తల్లిదండ్రులు వీరికి దగ్గరలోనే ఉండేవారు. గొడవ జరిగిన ప్రతీసారి వారు సర్ది చెప్పేవారు. మరో వ్యక్తితో కూడా ఆమని గతంలో సన్నిహితంగా ఉంది.
కొడుకు కోసం రూట్ క్లియర్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. 2024 ఎన్నికల్లో పోటీకి దూరం..
కొద్ది రోజుల కిందట.. రాము పిన్ని, ఆమె కూతుర్లు ఆమని ఇంటికి వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ, ఆమని వారందరిని చంపేస్తానని బెదిరించింది. ఈ నేపథ్యంలోనే రాము, ఆమనీలు గురువారం రాత్రి గొడవపడ్డారు. విసిగిపోయిన ఆమని ఇంట్లోని కూరగాయల కత్తితో రాము గొంతు కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై రాము అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. ఇదంతా అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఆ తర్వాత ఇంటి బయటకు వచ్చిన ఆమె ఎవరో ముగ్గురు వచ్చి రాముని కొట్టారని మొదట చెప్పుకొచ్చింది.
దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న తీరు.. వస్తువులు చిందర వందరగా ఉండడం.. ఆ సమయంలో అక్కడికి ఎవరూ రావడాన్ని చూడలేదని స్థానికులు చెప్పడం.. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు…రాముతో సహజీవనం చేస్తున్న ఆమని మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు.
దీంతో ఆమె నేరం అంగీకరించింది. రోజు మద్యం తాగి వచ్చి కొడుతున్నాడని.. వేధిస్తున్నాడని.. దీంతో కోపం పట్టలేక చంపేశానని పోలీసుల విచారణలో తెలిపింది. పోలీసులు రాము హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో తండ్రికి దూరమై.. తల్లి జైలు పాలై ఇద్దరు పిల్లలు అనాధలుగా మారి అమ్మమ్మ దగ్గరికి చేరారు. ఆమని తల్లి కూడా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఇప్పుడు ఇద్దరినీ ఎలా పెంచాలి.. అంటూ ఆమె కన్నీటి పర్యంతమవుతోంది.