
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. ధన్‌బాద్ నుంచి అలెప్పి వెళ్లే ఎక్స్‌ప్రెస్ (dhanbad alleppey express) రైల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన ఘటన కలకలం రేపింది. బీ-1 బోగి టాయిలెట్ వాష్ బేసిన్‌లో శిశువును వదిలి వెళ్లిపోయారు. బొకారో ఎక్స్‌ప్రెస్ (bokaro express) బుధవారం ఉదయం సింహాచలం స్టేషన్ నుంచి విశాఖకు వెళ్తుండగా 8.20 గంటల సమయంలో టాయ్‌లెట్ నుంచి శిశువు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. దాంతో ప్రయాణికులు అప్రమత్తమై శిశువును గుర్తించి టీటీఈకి సమాచారం అందించారు. దీనిపై ఆయన విశాఖ రైల్వే పోలీసులకు నివేదించారు.
రైలు విశాఖ రైల్వే స్టేషన్‌కు (visakhapatnam railway station) చేరుకునే సమయానికి ఆర్పీఎఫ్ పోలీసులు, వైద్య సిబ్బందితో సిద్ధంగా ఉండి, ప్రాధమిక పరీక్షల అనంతరం శిశువును రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఆపై మరింత మెరుగైన చికిత్స, సంరక్షణ నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వాల్తేర్ డీఆర్ఎం (waltair drm) అనూప్ సత్పతి వేగంగా స్పందించిన టీటీఈకి రివార్డు ప్రకటించారు. అలాగే ఈ చిన్నారి బాధ్యత తీసుకునేందుకు డీఆర్ఎం ముందుకొచ్చారు. శిశువు తల్లిదండ్రులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకవేళ చిన్నారి పోషణకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లయితే వారికి సాయం చేస్తామని డీఆర్ఎం వెల్లడించారు.