నారాయణను వదిలేదే లే... బెయిల్ రద్దుపై జగన్ సర్కార్ ఫోకస్, రేపు హైకోర్టులో లంచ్ మోషన్..?

By Siva KodatiFirst Published May 11, 2022, 8:34 PM IST
Highlights

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనకు సంబంధించి అరెస్ట్ అయి... అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ. అయితే ఈ కేసులో ఆయనను ఎట్టి పరిస్ధితుల్లో వదలకూడదని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా వుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ (ssc exam paper leak) ఘటనను వదిలే ప్రసక్తే లేదంటోంది ఏపీ సర్కార్ (ap govt). మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత నారాయణ (narayana bail) బెయిల్ ‌ను రద్దు చేయాలంటూ హైకోర్టును (ap high court) ఆశ్రయించనుంది. దీనిలో భాగంగా గురువారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనిపై న్యాయ నిపుణులతో ఏపీ అధికారులు చర్చిస్తున్నారు. ఈ కేసులో నారాయణ పాత్ర వుందని.. ఆధారాలతోనే అరెస్ట్ చేశామని ప్రభుత్వం చెబుతోంది. 

అంతకుముందు .. పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజ్ ఘటనకు సంబంధించి నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఏపీ మాజీ మంత్రి నారాయణకు బుధవారం బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాదులో నిన్న అరెస్టు చేసి చిత్తూరు తరలించారు. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నారాయణ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యా సంస్థల (narayana educational institutions) చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఆయనకు బెయిల్ లభించిన తరువాత నారాయణ తరఫు న్యాయవాది మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు పేర్కొన్నారు.  నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మే విధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిననాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని  న్యాయమూర్తి  ఆదేశించారని,  నారాయణ పై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు

click me!