
Jr NTR - TDP MLA Controversy: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్‌పై తాను దుర్భాషలాడినట్టు ప్రచారం జరుగుతున్న ఆ ఆడియోలో ప్రచారం జరుగుతుందనీ, అది పూర్తిగా నకిలీవని ఆయన స్పష్టం చేశారు. తనను కించపరిచే ఉద్దేశంతో కొంతమంది వ్యతిరేకులు ఫేక్ ఆడియో, వీడియోలను సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఓ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఓ వీడియోలో మాట్లాడుతూ "నారా, నందమూరి కుటుంబాలంటే నాకు ఎంతో అభిమానముంది. జూనియర్ ఎన్టీఆర్‌కు నేను గౌరవం ఇస్తాను. ఆయన అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి" అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి, నకిలీ వీడియోలు, ఆడియోలపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు.
ఇక, నిన్నటి వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన ఒక ఆడియోలో దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులతో దూషించినట్టు వినిపించింది. ఇది ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అయితే ఆ ఆడియోలన్నీ తప్పుడు సృష్టించబడ్డవని ఎమ్మెల్యే ఖండించారు. ఈ వివాదం అనంతపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇకపై ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం
మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉద్రిక్తత సృష్టించారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న కార్యాలయాన్ని అభిమానులు ముట్టడించి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌పై దూషణలు చేశారనే ఆరోపణలతో బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ఆడియో కాల్ రికార్డింగ్ పై అభిమానులు ప్రశ్నించగా, అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు అభిమానులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో లేరని సిబ్బంది చెప్పినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కార్యాలయం ముందు బైఠాయించారు. "ఎన్టీఆర్ ఎప్పుడూ టీడీపీ కోసం పని చేస్తానని చెప్పాడు. అలాంటి వ్యక్తిని దూషించడం సరైంది కాదు. మేము వేసిన ఓట్లతోనే మీరు ఎమ్మెల్యే అయ్యారు. అందువల్ల ఫ్యాన్స్ ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి" అని అభిమానులు తీవ్రంగా డిమాండ్ చేశారు.