కడప జిల్లాకు రాజ్యసభ అవకాశం ?

First Published Mar 10, 2018, 6:45 AM IST
Highlights

జిల్లాకు రాజ్యసభ సీటును కేటాయించటం వెనుక చంద్రబాబుకు పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం.

త్వరలో భర్తీ కానున్న రాజ్యసభ స్ధానాల్లో ఒక సీటును చంద్రబాబునాయుడు కడప జిల్లాకు కేటాయించనున్నారా? పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయ్. జిల్లాకు రాజ్యసభ సీటును కేటాయించటం వెనుక చంద్రబాబుకు పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. పార్టీలో సీనియర్ నేతైన రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డికి రాజ్యసభకు వెళ్ళే అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈనెల 23వ తేదీన జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టిడిపికి రెండు సీట్లు వస్తాయి. అందుకోసం పార్టీ నేతల నుండి చంద్రబాబుపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అంతమంది రాజ్యసభ అవకాశం కోసం ఒత్తిడి పెడుతుంటే తాను ఏమాత్రం అడగకపోయినా సిఎం దృష్టి మాత్రం శ్రీనివాసరెడ్డిపై ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీనివాసరెడ్డి 2014 లో టీడీపీ కడప ఎంపీ అభ్యర్తి గా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో వాసును కడపజిల్లా అధ్యక్షునిగా నియమించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి వాసు చేస్తున్న కృషి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవసారి కూడా జిల్లా అధ్యక్షునిగా కొనసాగించారు. వాసు కృషితోనే వైస్సార్సీపీ ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి ని టీడీపీ లోకి రావడానికి చొరవ తీసుకున్నారు. అలాగే ఎంఎల్సీ ఎన్నికల్లో వైఎస్. వివేకానంద రెడ్డిని ఓడించి బిటెక్ రవిని గెలిపించటంలో కష్ట పడ్డారు.  

వాసు హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మాజీ మంత్రి రాజగోపాలరెడ్డి కొడుకుగా వాసు జిల్లా రాజకీయాల్లో కొద్ది కాలంలో చొచ్చుకుపోయారు. వాసు తమ్ముడు రమేష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గా పనిచేశారు. బావ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి. స్వతహాగా రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండటంతో జిల్లాలో పట్టు సాధించారు.  

ప్రస్తుత పరిస్థితిలో వాసును రాజ్యసభ కు పంపి ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి ని 2019 లో కడప ఎంపీ గా నిలబెట్టాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో వైఎస్ కుటుంబం ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్న విషయం అర్ధమవుతోంది. అందులో భాగంగానే శ్రీనివాసరెడ్డి పేరును చంద్రబాబు రాజ్యసభకు పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలంటున్నారు.

 

click me!