సిఎం పీఠంపై మళ్ళీ పన్నీర్ ?

First Published Apr 20, 2017, 9:36 AM IST
Highlights

పన్నీర్ ను సిఎం చేయాలంటే పళని స్వామిని కేంద్రంలోకి తీసుకుంటామంటూ భాజపా ఢిల్లీ పెద్దలు ఓ ప్రతిపాదన పంపారట.

తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం. కేంద్రమంత్రిగా ఢిల్లీకి వెళిపోనున్న ముఖ్యమంత్రి పళనిస్వామి...ఎలాగుంది కమలం పార్టీ మంత్రాంగం. ఇంతకాలం తెరవెనుకే ఉండి కథ నడిపిస్తున్న భాజపా మెల్లిమెల్లిగా తెరముందుకే వస్తోంది. పళనిస్వామికి కేంద్రమంత్రి పదవి ఎలా ఇస్తారట? ఎందుకంటే, ఎన్డీఏలో ఏఐఏడిఎంకె మిత్రపక్షం కాదు.

అయితే, తమ చేతిలో కీలుబొమ్మ లాంటి పన్నీర్ ను సిఎం చేయాలంటే పళని స్వామిని కేంద్రంలోకి తీసుకుంటామంటూ భాజపా ఢిల్లీ పెద్దలు ఓ ప్రతిపాదన పంపారట. దాంతో అతితొందరలోనే ఏఐఏడిఎంకెను తమ చెప్పుచేతుల్లోకి తీసుకోవాలని భాజపా ప్లాన్ వేసిందన్న విషయం తెలిసిపోతోంది.

అందుకే ముందు పార్టీని ఎన్డీఏలోకి చేర్చుకుని వెంటనే పళనికి కేంద్రమంత్రి పదవి ఇస్తారు. దాంతో ఎలాగూ తమిళనాడులోని అధికార పార్టీ మిత్రపక్షం అయిపోతుంది కాబట్టి రాష్ట్రంలో భాజపా చక్రం తిప్పవచ్చు. ఇది కమలనాధుల ప్లాన్. జయ జీవించి ఉన్నంత వరకూ భాజపాకు వేలుపెట్టే అవకాశం కూడా ఇవ్వలేద. అందుకే అవకాశం రాగానే వేలేం ఖర్మ ఏకంగా మొత్తం తలకాయనే దూర్చేయాలని అనుకుంటోంది.

జయ మరణంతోనే తమిళనాడులో పుంజుకోవాలని కమలం పార్టీ వ్యూహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ముందు శశికళ అడ్డు తొలగించుకుంది. తరువాత టిటివి దినకరన్ను కూడా జైలుకు పంపుతోంది. దాంతో అధికార పార్టీలో భాజపాకు అడ్డు చెప్పే వారే ఉండరు. బహుశా కేంద్రంలో ఏఐఏడిఎంకె చేరుతున్నందున ఏదో ఓ రూపంలో రాష్ట్రమంత్రివర్గంలో భాజపా చేరినా చేరవచ్చు. అదే జరిగితే తమిళనాడు చరిత్రలో మొదటిసారిగా భాజపా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందేమో. ‘ఏమో గుర్రం ఎగరా వచ్చు’ చూద్దాం...

click me!