నంద్యాల ఎన్నిక: అనేక ప్రశ్నలు

Published : Aug 21, 2017, 09:09 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
నంద్యాల ఎన్నిక: అనేక ప్రశ్నలు

సారాంశం

ఫిరాయింపులను చంద్రబాబు రాజకీయ వ్యభిచారంతో పోల్చిన సంగతి ఎవరూ మరచిపోలేరు.   ఫిరాయింపు ఎంఎల్ఏ గెలుపుపై బహుశా నమ్మకం లేకే చంద్రబాబు మౌనం వహించారేమో? అటువంటి సమయంలోనే నంద్యాల ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణించారు. దాంతోనే నంద్యాల ఉపఎన్నిక తప్పలేదు. అప్పటికీ చంద్రబాబు సెంటిమెంటును ప్రయోగించి ఉపఎన్నికను ఏకగ్రీవంగా లాక్కోవాలని చూసినా జగన్ అంగీకరించలేదు.   

నంద్యాల ఉపఎన్నికలో గెలుపోటములు ఎలాగున్నా అనేక ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయ్. ఉపఎన్నికలో గెలిచే అవకాశం సహజంగా అధికారపార్టీకే ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ ప్రస్తుత నంద్యాల ఎన్నిక గతంలో జరిగిన ఉపఎన్నికల లాంటివి కాదు. ఎందుకంటే, గతంలో ఎన్నడూ లేనివిధంగా చంద్రబాబునాయుడు భారీ ఎత్తున ఫిరాయింపులకు తెరలేపారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా అప్పట్లో కొందరు టిఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరారు. అయితే వారికి పార్టీ అధినేతతో పడలేదు. దాంతో వారు కెసిఆర్ పై తిరుగుబాటు చేసారు. దాన్ని వైఎస్ అవకాశంగా తీసుకున్నారు.

కానీ ఇపుడు పరిస్ధితి అదికాదు. గడచిన మూడున్నరేళ్ళుగా ఫిరాయింపు ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు ఎన్నిరకాలుగా ప్రలోభాలకు గురిచేసిందీ అందరూ చూస్తున్నదే. పోనీ వారిచేత రాజీనామాలు చేయించారా అంటే అదీలేదు. మళ్ళీ వారిలో అదనంగా నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. దాంతో ఫిరాయింపుల సమస్య ముదిరిపాకానపడింది.

అంతుకుముందే తెలంగాణ ముఖ్యమంత్రి టిడిపికి చెందిన ఎంఎల్ఏలను లాక్కున్నారు. అప్పట్లో ఫిరాయింపులపై కెసిఆర్ ను చంద్రబాబు అమ్మనాబూతులు తిట్టారు. ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంతో పోల్చిన సంగతి ఎవరూ మరచిపోలేరు.  చివరకు ‘కోడలికి బుద్ది చెప్పి అత్త కూడా తెడ్డునాకింది’ అన్నట్లు చంద్రబాబు కూడా కెసిఆర్ మార్గన్నే అనుసరించారు.

ఫిరాయింపు ఎంఎల్ఏ గెలుపుపై బహుశా నమ్మకం లేకే చంద్రబాబు మౌనం వహించారేమో? అటువంటి సమయంలోనే నంద్యాల ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణించారు. దాంతోనే నంద్యాల ఉపఎన్నిక తప్పలేదు. అప్పటికీ చంద్రబాబు సెంటిమెంటును ప్రయోగించి ఉపఎన్నికను ఏకగ్రీవంగా లాక్కోవాలని చూసినా జగన్ అంగీకరించలేదు. సరే, మొత్తానికి ఉపఎన్నిక తప్పలేదు.

ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ టిడిపి గెలిస్తే జనాలు ఫిరాయింపులను పట్టించుకోవటం లేదని అనుకోవాలా? నంద్యాలలో ఉపఎన్నికల ముందు వరకూ ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నది వాస్తవం. అయినా ప్రజలు పట్టించుకో లేదా? ఉపఎన్నికలో గెలవటానికి టిడిపి తొక్కుతున్న అడ్డదారులను నంద్యాల ఓటర్లు సమర్ధించినట్లేనా?

సామాజికవర్గాల్లో పట్టుందనుకున్న వారిని వ్యక్తిగతంగా ప్రలోభాలకు గురిచేసి మొత్తం సామాజిక వర్గాన్ని లోబరుచుకోవచ్చా? సంక్షేమ పథకాల అమలు ముసుగులో ఓటర్లకు వలవేసి లొంగదీసుకోవచ్చా? స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా ఓటర్లను భయపట్ట వచ్చా?

వైసీపీని అణగదొక్కేందుకు పలువురు నేతలపై కేసులు పెట్టించటాన్ని ప్రజలు సమర్ధిస్తున్నట్లేనా? కోట్ల రూపాయలు వెదజల్లి, ప్రలోభాలకు గురిచేస్తే జనాలు ఓట్లేసేస్తారా? సాధ్యం కాకపోతే భయపెట్టి ఓటర్లను లొంగదీసుకుని ఎన్నికల్లో గెలవచ్చా? ఓటర్లను భయపెట్టి గతంలో ఎవరైనా? ఎక్కడైనా గెలిచారా? అనే ప్రశ్నలకు జనాలు సమాధానం చెప్పే సమయం దగ్గరపడింది.

టిడిపి గెలిస్తే మాత్రం పై ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వైసీపీ గెలిస్తే మాత్రం చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిందే.

PREV
click me!

Recommended Stories

నెల్లూరు లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు: Christmas Celebrations in Nellore | Asianet News Telugu
Vijayawada Christmas Eve Celebrations 2025: పాటలు ఎంత బాగా పడుతున్నారో చూడండి | Asianet News Telugu