ముగుస్తున్న ‘నంద్యాల’ ప్రచార యుద్ధం

First Published Aug 21, 2017, 7:18 AM IST
Highlights
  • మరి కొద్ది గంటల్లో నంద్యాల ఉపఎన్నిక ప్రచార యుద్ధం ముగుస్తోంది.
  • సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించేయాలి.
  • వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 13 రోజుల అలుపెరుగని ప్రచారం, చంద్రబాబు మూడు రోజుల మకాంకు తెరపడనున్నది.
  • సరే, ఎన్నికలో ఎవరు గెలుస్తారన్న విషయం పక్కన బెడితే ఫలానా అభ్యర్ధిదే గెలుపన్న విషయమై టిడిపి, వైసీపీ అభ్యర్ధుల మధ్య అంచనాలు మాత్రం రోజు రోజుకూ మారిపోతోందన్న విషయం మాత్రం వాస్తవం.
  • ఈనెల 23వ తేదీ పోలింగ్ జరుగుతుండగా 28వ తేదీ కౌటింగ్ జరుగుతుంది

మరి కొద్ది గంటల్లో నంద్యాల ఉపఎన్నిక ప్రచార యుద్ధం ముగుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించేయాలి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 13 రోజుల అలుపెరుగని ప్రచారం, చంద్రబాబు మూడు రోజుల మకాంకు తెరపడనున్నది. సరే, ఎన్నికలో ఎవరు గెలుస్తారన్న విషయం పక్కన బెడితే ఫలానా అభ్యర్ధిదే గెలుపన్న విషయమై టిడిపి, వైసీపీ అభ్యర్ధుల మధ్య అంచనాలు మాత్రం రోజు రోజుకూ మారిపోతోందన్న విషయం మాత్రం వాస్తవం.

ఉపఎన్నిక అనివార్యమని తేలిన దగ్గర నుండి టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టేసారు. అభ్యర్ధికి తోడుగా మంత్రులు, ఎంఎల్ఏ, ఎంఎల్సీ తదితరులు నియోజకవర్గంలోనే క్యాంపు వేసి ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. తర్వాతెప్పుడో వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంకోవైపు ఎన్నిక షెడ్యూల్ ప్రకటించేముందే చంద్రబాబునాయుడు రెండుసార్లు నియోజకవర్గంలో ప్రచారం చేసేసారు.

అయితే జగన్ మాత్రం ఈనెల 3వ తేదీన నంద్యాల బహిరంగసభతో తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తర్వాత 9వ తేదీనుండి రోడ్డుషోలు మొదలుపెట్టి ప్రచారానికి ఊపుతెచ్చారు. అంతకుముందు వరకూ తమదే గెలుపన్నధీమాతో ఉన్న టిడిపిలో  జగన్ రోడ్డుషోతో కంగారు మొదలైంది. చంద్రబాబుపై జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ప్రచారంలో హీట్ పెంచేసింది. దాంతో ప్రచారంలో పార్టీల విధివిదానాలకన్నా వ్యక్తులే లక్ష్యంగా మారారు. చంద్రబాబుపై జగన్  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందగ్గర నుండి టిడిపి ప్రచారం మొత్తం జగన్ చుట్టూ తిరగటమే సరిపోయింది.

అదే సమయంలో వైసీపీ నేతల ఇళ్ళపై పోలీసుల దాడులు, ఓటర్లను భయపెట్టటం, ప్రలోభాలు ఊపందుకోవటం, సామాజికవర్గంలో పట్టుందనుకున్న వారికి తాయిలాల పంపిణీ తదితర మార్గాలన్నింటినీ టిడిపి అనుసరించిందనుకోండి అది వేరే సంగతి. సరే, ఇక డబ్బు పంపిణీ అంటారా రెండు పార్టీల్లోనూ ఎవరి శక్తిమేరకు వారు పంపిణీ చేసారు. అయితే, అధికారంలో ఉంది కదా టిడిపికే అవకాశం ఎక్కువుంటుందనటంలో సందేహం లేదు.

ఇక, నియోజకవర్గంలో నంద్యాల పట్టణం, రూరల్, గోస్పాడు మండలాలున్నాయి. 2, 18, 852 ఓటర్లున్నారు. 110 పోలింగ్ కేంద్రాల్లో 255 పోలింగ్ బూత్ లున్నాయి. 71 కేంద్రాల్లో 104 బూతులను అత్యంత సమస్యాత్మకమైనవిగా ఎన్నికలకమీషన్ గుర్తించింది. అందుకనే మామూలు పోలీసులతో పాటు ప్యారా మిలిటరీ దళాలను కూడా వినియోగిస్తోంది. మొదటిసారిగి ఉపఎన్నికలో ‘వివి ప్యాట్’ అనే టెక్నాలజీని వాడుతున్నారు. తాము ఎవరికి ఓటు వేసామన్న విషయం ఓటరుకు కనబడుతుంది.  

 

 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!