కెవిపి జగన్ వైపు చూస్తున్నారా: ఆయన వైఖరిలో మార్పునకు ఇదే కారణమా?

By Nagaraju penumalaFirst Published Jun 5, 2019, 6:16 PM IST
Highlights

వైయస్ జగన్ పై ఎన్నడూ లేనంతగా ఆయన స్పందించడం వెనుక ఉద్దేశం వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపడమేనని తెలుస్తోంది. అందువల్ల వైయస్ జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇకపోతే కేవీపీ రామచంద్రరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీలో గందరగోళం నెలకొనే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

అమరావతి: దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అంటే అందరికీ గుర్తే ఉంటుంది కదూ. ఇంకెవరు కేవీపీ రామచంద్రరావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహితుడిగా రాజకీయాల్లో పరిచయం అయిన కేవీపీ తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పటికీ కీలక నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఏపీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కుటుంబంతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగానే ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. 

వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీ వీడటం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం, ఆస్తుల కేసులో జైలుపాలైన సందర్భంలో కూడా ఏనాడు కేవీపీ వారి గడప తొక్కిన సందర్భంలేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చిన పరిస్థితి లేదు. 

అయితే కేవీపీ రామచంద్రరావు మనసు ప్రస్తుతం మారుతోందని ప్రచారం జరుగుతోంది. కేవీపీ రామచంద్రరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డిపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన వైయస్ రాజశేఖర్ రెడ్డితో ఉండవల్లి అనే పుస్తకావిష్కరణ సభ జరిగింది. 

ఆ పుస్తకావిష్కరణకు కర్త కర్మ క్రియ అంతా కేవీపీ రామచంద్రరావేనని ప్రచారం జరుగుతుంది. ఇకపోతే వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా స్వయంగా వైయస్ జగన్ ఆహ్వానించారు. జగన్ ప్రమాణస్వీకారానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు కేవీపీ రామచంద్రరావు. 

అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పాలన విజయవంతం కావాలని ఆకాంక్షించారు కూడా. అంతేకాదు జగన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగన్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసిన మీడియాపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

వైయస్ జగన్ పై ఎన్నడూ లేనంతగా ఆయన స్పందించడం వెనుక ఉద్దేశం వైసీపీలో చేరేందుకు ఉత్సాహం చూపడమేనని తెలుస్తోంది. అందువల్ల వైయస్ జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారంటూ వార్తలు వినబడుతున్నాయి. 

ఇకపోతే కేవీపీ రామచంద్రరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీలో గందరగోళం నెలకొనే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలాగో నేడు వైయస్ జగన్ కు విజయసాయిరెడ్డి అలా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఉంది. 

కేవీపీ రామచంద్రరావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీలో చాలామంది పొజిషన్లు మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద తలకాయల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం విజయసాయిరెడ్డి, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిలు ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్ తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేది వీరిద్దరే అని తెలుస్తోంది. 

కేవీపీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయన ముందుగా వీరికే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేవీపీ రామచంద్రరావు రాజకీయ వ్యూహకర్త. సైలెంట్ గా ఉంటూ వ్యూహాలు రచించడంలో ఆయనకు మించిన వారు ఉండరు. 

వైసీపీలోకి వచ్చిన ఆయన తనతో పరిచయాలు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ జైలుపాలవ్వడం, కేసులతో వేధించినప్పుడు దరి చేరని కేవీపీ ఇప్పుడు దరిచేరడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 

కేవీపీని పార్టీలో చేర్చుకోవద్దంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు కూడా. ఇకపోతే వైయస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు కేవీపీ. వైయస్ రాజశేఖర్ రెడ్డి వెన్నంటి నడుస్తూ తనకంటూ ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారారు. సైలెంట్ గా ఉంటూ వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన కేవీపీ రామచంద్రరావు అంటే వైయస్ఆర్ కు విపరీతమైన అభిమానం. అందువల్లే అనేక సభలలో తన ఆత్మ కేవీపీ అంటూ చెప్పుకొచ్చారు. 

మరి వైయస్ ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావును సీఎం జగన్ ఆహ్వానిస్తారా...పార్టీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.   

click me!