నవదంపతులపై దాడి: ప్రియుడి మోజులో భార్యనే భర్తను చంపించింది

First Published May 8, 2018, 5:58 PM IST
Highlights

పార్వతీపురం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నవదంపతులపై దుండగులు దాడి చేసి దోపిడీ చేశారనే సంఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

విజయనగరం: పార్వతీపురం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నవదంపతులపై దుండగులు దాడి చేసి దోపిడీ చేశారనే సంఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. భార్యనే భర్తను చంపించినట్లు వెలుగు చూసింది.

సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ పాలరాజు మీడియాకు వెల్లడించారు. భర్త శంకర రావును భార్య సరస్వతి తన ప్రియుడు శివతో కలిసి పథక రచన చేసి చంపించినట్లు తేలింది. శివ సరస్వతికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. వారిద్దరు ప్రేమించుకున్నారు. 

అయితే, సరస్వతికి శంకరరావుతో వివాహం జరిగింది. దీంతో ఆమె అతన్ని చంపాలని నిర్ణయించుకుంది.  సరస్వతి కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. శంకరరావు హత్యకు శివ గోపిని సంప్రదించాడు. శివకు సరస్వతి నిశ్చితార్థం ఉంగరం ఇచ్చింది. సుపారీ ఇచ్చిన తర్వాత గోపికి శంకరరావును చూపించింది. 

శంకరరావుపై దాడి చేసి అతన్ని హత్య చేసిన తర్వాత సరస్వతి గాజులు పగులగొట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చర్యలు, తనిఖీలు చేపట్టి నిందితులను మనాయిపల్లి వద్ద ఆటోలో పట్టుకున్నారు. 

ఎవరికీ అనుమానం రాకుండా సరస్వతి నిందితురాలు దారి కాచి తన భర్తను చంపేశారని, తన మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య జరిగిన స్థలాన్ని సందర్శించి, సరస్వతిని విచారించిన తర్వాత ఎస్పీకి అనుమానం కలిగింది పార్వతీపురం నుంచి విజయనగరం జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురిని పోలీసులు విచారించారు. పొంత లేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీకి మరింత అనుమానం వచ్చింది. 

వారిని గణపతి నగరం స్టేషన్ కు తరలించి విచారించారు. దాంతో వారు అసలు విషయం చెప్పారు. నేరాన్ని ముగ్గురు అంగీకరించినట్లు ఎస్పీచెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బైక్ ను సర్వీసింగ్ కు ఇచ్చేందుకంటూ దంపతులు సోమవారం పార్వతీపురం వచ్చారు. సర్వీసింగ్ పూర్తి చేసుకుని రాత్రి 7.30 గంటలకు బయలుదేరి తోటపల్లి సమీపంలోని ఐటిడిఎ పార్కు వద్ద లఘుశంక తీర్చుకునేందుకు ఆగారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేశారు. 

గౌరీశంకర రావును దుండగులు తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టారు. దాంతో అతను మరణించాడు. 

click me!