ఏడాదిన్నరగా ప్రియుడితో రాసలీలలు: సుపారీ ఇచ్చి భర్తను చంపి...

By Pratap Reddy Kasula  |  First Published Aug 5, 2023, 8:12 AM IST

ఏడాదిన్నరగా ప్రియుడితో రాసలీలల్లో మునిగితేలుతున్న మహిళ తన భర్తను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది, ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది.


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో జరిగిన కానిస్టేబుల్ బర్రి రమేష్ కుమార్ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడిపై మోజుపడడమే కాకుండా భర్త ఉద్యోగాన్ని కూడా ఆశించి మహిళ ఘాతుకానికి పాల్పడింది. మద్యం తాగించి నిద్రపోతున్న సమయంలో భర్త బర్రి రమేష్ కుమార్ (40)ను భార్య శివజ్యోతి అలియాస్ శివాని హత్య చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు కమీషనర్ త్రివిక్రమ వర్మ మీడియాకు వెల్లడించారు. 

రమేష్ కుమార్ విశాఖపట్నం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. భార్య శివానీతో కలిసి ఎంవీపి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన డ్యూటీ చేసి వచ్చిన రమేష్ తెల్లారేసరికి మరణించాడు. తన భర్త రమేష్ గుండెపోటుతో మరణించాడని శివానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ మల్లేశ్వర రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతనికి శివానీ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శవానికి కెజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించారు. రమేష్ ఊపిరాడక చనిపోయినట్లు అందులో తేలింది.

Latest Videos

రమేష్ హత్యకు ప్రియుడు రామారావుతో కలిసి శివానీ పక్కా ప్రణాళిక వేసి అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రామారావు అనే వ్యక్తి వీరి ఎదురింట్లో ఉంటూ, వీరి ఇంటి పక్కన కారును పార్క్ చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం శివానీకి రామారావుతో వైవాహికేతర సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన రమేష్ రామారావుతో గొడవకు దిగాడు. ఆ తర్వాత శివానీ, రామారావు కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లిపోయారు. 

అయితే, ఇరు కుటుంబాలకు చెందినవారు శివానీ, రమేష్ ల మధ్య రాజీ కుదిర్చారు. శివానీని ఇంటికి తెచ్చారు. అయినా భార్యాభర్తల మధ్య వివాదం సద్దుమణగలేదు. రామారావు వద్దకే వెళ్లిపోవాలని రమేష్ భార్యను హెచ్చరించాడు. పిల్లలను తీసుకుని వెళ్తానని ఆమె అంటూ వచ్చింది. దీంతో ఇరువురి మధ్య గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో మరో ఇద్దరికి సుపారీ ఇచ్చి భర్తను రామారావుతో కలిసి హత్య చేసింది. తన వద్ద ఉన్న బంగారాన్ని 1.50 లక్షలకు విక్రయించి అప్పుఘర్ కు చెందిన నీలా అనే వ్యక్తికి శివానీ సుపారీ ఇచ్చింది. ఆగస్టు ఒక్కటో తేదీ రాత్రి రమేష్ మద్యం సేవించి నిద్రపోయాడు. ఈ సమయంలో రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి అదిమిపట్టుకోగా శివానీ కాళ్లు పట్టుకుని హత్య చేశారు. రామారావు ఇంటి బయట కాపలా కాశాడు.

భర్త హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించి అతని ఉద్యోగం ద్వారా లభించే ఆర్ఠిర ప్రయోజనాలను, ఉద్యోగాన్ని పొందాలని శివానీ ప్లాన్ వేసింది. రమేష్ హత్య కేసులో శివానీ, రామారావు, నీలాలను నిందితులుగా చేర్చారు. రమేష్, శివానీలకు మూడు, ఐదేళ్ల కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. 

click me!