
కడప : మద్యం తాగి వేధిస్తున్న భర్తను ఓ భార్య హత్య చేసిన ఘటన కడప చిన్నచౌక్ లో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ‘కడప నకాష్ వీధికి చెందిన పోలూరి సుబ్బ నరసయ్య (45)కు, సుజాతకు 15 ఏళ్ల కిందట వివాహమయ్యింది. వీరిద్దరూ వెదురు బుట్టలు అల్లుకొని జీవనం సాగిస్తూ ఉండేవారు. వీరికి ఒక కుమార్తె ఉంది. సుబ్బ నరసయ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ తాగి వచ్చి భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక సుజాత రెండు నెలల నుంచి శ్రీకృష్ణదేవరాయల కాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంట్లో కుమార్తెతో కలిసి ఉంటుంది.
సోదరుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఫార్మసిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రతి సోమవారం విధులకు వెళ్లి శనివారం సాయంత్రం కడపకు వస్తుంటాడు. సుబ్బనర్సయ్య మంగళవారం తెల్లవారుజామున భార్య సుజాత వద్దకు వెళ్ళాడు. ఇద్దరు గొడవపడ్డారు. సుజాత ఇంట్లో ఉన్న రోకలి బండ తీసుకుని తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ గొడవ గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సుబ్బనరసయ్య సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజాతపై హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
విషాదం : ఇచ్చిన రుణాలు వసూలు కాక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య..
ఇదిలా ఉండగా, గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శ్ నగర్ కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్ (23) డీజే సౌండ్ బాక్సులు అద్దెకి ఇస్తూ ఉంటాడు. అతనికి వివాహం అయ్యింది. భార్య సౌమ్య, ఒక కుమారుడు ఉన్నారు. గంజాయికి బానిసైన కిరణ్ రోజు ఇంట్లో గొడవ పడుతుండడంతో విసిగిపోయిన భార్య సౌమ్య కుమారుడితో సహా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
రోజూ గంజాయి తాగి రావడం.. తల్లిదండ్రులను విపరీతంగా కొట్టడం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తనకు డబ్బులు ఇవ్వాలని రెండు నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగలబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఉన్న ఊరు విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు. కాగా, 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శించడానికి మళ్ళీ తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్ తల్లిదండ్రులను కొట్టి.. హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆ రోజు నుంచి వారిని ఇంట్లోనే ఉంచుకున్నాడు.
సోమవారం కూడా గంజాయి తాగి, ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూ కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదునుగా కిరణ్ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు. అయితే, కొడుకు మృతి తట్టుకోలేక వారు ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత కిరణ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు.