
రామ్ గోపాల్ వర్మ తీయబోయే సినిమా అంటే తెలుగుదేశంపార్టీ ఉలిక్కిపడుతోంది. కారణాలేంటనే విషయం అందరికీ తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే పేరుతో వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తాననగానే టిడిపి వైపు నుండి వర్మపై వరుసగా దాడులు మొదలయ్యాయి. మొన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. నిన్న పాయకరావుపేట ఎంఎల్ఏ వంగలపూడి అనిత. తాజాగా మరో మంత్రి అమరనాధ్ రెడ్డి. సెన్సేషన్ కోసమే వర్మ సినిమా తీస్తారని అమరనాధ్ అంటున్నారు. వర్మ ఎలాంటి వారో ప్రజలకు తెలుసంటూనే వర్మ తీయబోయే సినిమా గురించి ఆలొచించాల్సిన అవసరం లేదంటున్నారు.
వ్యాపారమే పరమావధిగా తీసే సినిమాకు టిడిపి స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. సెన్సేషన్ కోసమే సినిమా తీసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు వర్మ అంటూ ఆరోపించటం విచిత్రంగా ఉంది. వర్మ వెర్షన్లో సినిమా తీసినంతమాత్రాన జనాలు ప్రభావితమవ్వరని, తానేం చేస్తాడో వర్మకే తెలియదని తన అక్కసంతా వెళ్ళగక్కారు వర్మపై మంత్రి. జరుగుతున్నది చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా టిడిపి వాళ్ళను బాగానే ఇబ్బంది పెట్టేట్లే ఉంది.
అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుతో సినిమా వస్తోందంటేనే టిడిపి నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏంటి ? మొదటి కారణం, సినిమా కథ. దేని ఆధారంగా వర్మ సినిమా తీయబోతున్నాడో టిడిపి వాళ్ళు ఊహించగలుగుతున్నారు. సినిమాలో ఎటువంటి సన్నివేశాలుండబోతున్నాయో కూడా ఊహించేసుకుంటున్నారు. అంటే సినిమాలో టిడిపిని లేదా చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టే అంశాలేవో ఉంటాయన్నదే వారి ఆందోళనగా స్పష్టమవుతోంది. ఇక రెండో కారణం, రామ్ గోపాల్ వర్మ దర్శకుడవ్వటమే. ఎందుకంటే, వర్మ ఎప్పుడు వివాదాస్పద అంశాల చుట్టూనే కథలు అల్లుకుంటారు. అందుకనే టిడిపిలో అంతటి ఆందోళన కనబడుతోంది.
ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి వర్మ విడుదల చేసింది ఒకటి, రెండు ఫోటోలే.. సినిమాలో నటీ నటులెవరో ఇంకా ప్రకటించనే లేదు. సినిమా షూటింగ్ కూడా మొదలే కాలేదు. కేవలం సినిమా టైటిల్, విడుదల చేసిన ఫొటోకే టిడిపి వాళ్ళు ఇంతలా ఉలిక్కిపడుతున్నారు. సినిమా షూటింగ్ మొదలై ఇంకొన్ని వర్కింగ్ స్టిల్స్ గనుక విడుదలైతే అప్పుడెలా ఉంటుంది టిడిపి నేతల పరిస్ధితి ?