
పుట్టా సుధాకర్ యాదవ్.. ప్రస్తుతం అందరి నోటా ఇదే పేరు వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే.. సుధాకర్ యాదవ్ పేరు మీద వివిధ రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఏవరీ సుధాకర్ యాదవ్? ఎందుకు ఇప్పుడు అందరూ ఆయన గురించి చర్చించుకుంటున్నారు?
పుట్టా సుధాకర్ యాదవ్.. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత. యాదవ కులానికి చెందినవారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. పుట్టా సుధాకర్ యాదవ్ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకి వియ్యంకుడు కూడా. ఈయనను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మెన్ గా నియమిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనపై పలు రకాల విరమ్శలు మొదలౌతున్నాయి. ఇంతకీ పుట్టా సుధాకర్ యాదవ్ చేసిన తప్పేంటి..? అంటే.. ఆయనకు క్రైస్తవ సంస్థలతో సన్నిహిత సంబంధాలుండటమే.
వివరాల్లోకి వెళితే.. మైదుకూరు నియోజకవర్గంలో ఇటీవల క్రైస్తవులు ఓ సమావేశం నిర్వహించారు. దానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఆయన క్రైస్తవుడని.. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమించ వద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు అన్ని మతాలు, కులాల సమావేశాలకు వెళ్లడం చాలా కామన్. అదేవిధంగా పుట్టా సుధాకర్ కూడా సమావేశాలకు వెళ్లారు. దీంతో ఆయనపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే.. సమావేశాలకు ఏ రాజకీయ నాయకుడైనా వెళ్తాడు కానీ.. సుధాకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారంటే.. ఆయన క్రైస్తవ మతం తీసుకొనే ఉంటారని ప్రచారం మొదలైంది.
ఇదిలా ఉంటే.. మరో వైపు పుట్టా సుధాకర్ యాదవ్ ని వ్యతిరేకిస్తున్న వారిపై ఆయన మద్దతు దారులు విరుచుకుపడుతున్నారు. మొన్నటి దాకా ఆయన టీటీడీ దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పనిచేశారు. సభ్యునిగా పనిచేస్తే ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ.. ఛైర్మన్ గా నియమిస్తారనే ప్రచారం ఊపందుకోగానే గందరగోళం మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా, మద్దతుగా పలు వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ.. పుట్టా సుధాకర్ యాదవ్ కి ఛైర్మన్ పదవిని ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకి ఉందా? లేదా?