
పార్టీకి నష్టం కలిగిస్తున్నారని తెలిసీ ఎవరిపైనా చర్యలు తసుకోలేనంత వీక్ పొజిషన్లో ఉన్నారా చంద్రబాబు? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విశాఖపట్నం జిల్లాపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్పంగా బయటపడింది. చాలా కాలంగా జిల్లా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటోంది. దాంతో ఇద్దరి మంత్రులకు మద్దతుగా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉన్నతాధికారులైతే ‘అడకత్తెరలో పోకచెక్క’లై పోతున్నారు.
ఈ విషయాలపై అక్కడి మీడియాలో ప్రతీరోజూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఆ వార్తలన్నింటినీ చదివి వినిపించారు. మంత్రుల మధ్య సయోధ్య లేనికారణంగానే ప్రజల్లో పార్టీ పలుచనైపోతోందని మండిపడ్డారు. ఏ విషయంపైన కూడా మీడియాకు ఎక్కవద్దని బుద్దులు చెప్పారు. నేతల మధ్య ఏవైనా సమస్యలుంటే తనతో చెప్పాల్సిందిగా సూచించారు. అంతవరకూ బాగానే ఉంది. ఇంతకీ మంత్రులిద్దరిలో ఎవరు తప్పు చేసారన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు తేల్చలేకపోయారు. తప్పు చేసిన వారిని మందలించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు.
అనేక విషయాల్లో మంత్రులిద్దరి మధ్య విభేదాలున్నాయి. వాటని సర్దుబాటు చేసుకుని ఇద్దరూ కలిసేది కల్లే. వీరిద్దరినీ కలిపేపాటి శక్తి కూడా చంద్రబాబుకు లేదు. పైగా ఎవరిని తప్పు పడితే ఏమవుతుందోనన్న భయం. గంటాను తప్పు పట్టేందుకు లేదు. ఎందుకంటే, ఇప్పటికే గంటా పార్టీ మారిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ తో టచ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం సాగుతోంది. అవసరమైతే పవన్ కల్యాణ్ తో కూడా కలవగలిగిన నేర్పు గంటాకుంది. పైగా నారాయణకు వియ్యంకుడు
అలాగని, చింతకాయలను తప్పపడదామంటే ఆయనా ఒప్పుకోరు. అందులోనూ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు దండగంటూ ఈమధ్య బహిరంగంగానే చెబుతున్నారు. దానికితోడు జిల్లా పార్టీలోని అత్యధిక నేతలు చింతకాయలకు మద్దతున్నారు. కాబట్టి చంద్రబాబు ఎవ్వరి పేరూ ఎత్తకుండానే సమావేశం ముగించారు. అంటే, తప్పుచేసిన వారిని కూడా నేరుగా ఏమనలేని పరిస్ధితిలో చంద్రబాబున్నారు. ఈ మాత్రందానికి సమీక్షలెందుకు? టైమ్ వేస్ట్ ఎందుకు?