
తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్ వేసిన నామినేషన్ సమయాన్ని చివరి నిముషంలో ఎందుకు మార్చుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు. అధికార పార్టీ వాళ్ళు అందులోనూ దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కూడా నిబంధనలు తెలుసుకోకుండా తప్పులో కాలేస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ గా లోకేష్ నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నామినేషన్ వేసే సమయాన్ని పలువురు పండితులతో సంప్రదించి నిర్ణయించారు. పండితులు పెట్టిన ముహూర్తమైతే 6వ తేదీ ఉదయం 10.39 గంటలు. ఆ సమయానికే పార్టీలోని సీనియర్లు లోకేష్ తో పాటు అసెంబ్లీకి చేరుకున్నారు.
అయితే, చివరినిముషంలో నామినేషన్ వేయాల్సిన సమయంపై ఎవరికో అనుమానం వచ్చింది. దాంతో ఆరా తీసారు. అధికారులు చెప్పిన సమాధానం విని అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే, లోకేష్ నిర్ణయించుకున్న ముహూర్తానికి గనుక నామినేషన్ వేసివుంటు సదరు నామినేషన్ చెల్లకుండా పోయేది. ఎలాగంటే, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం ఉదయం 11-3 మధ్య మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాలి. ఆ సమయానికి ముందు గానీ తర్వాత గానీ వేసే నామినేషన్లు చెల్లవు.
అయితే, నిబంధనలు తెలియని ఇన్ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ మాత్రం ఉదయం 10.30 గంటల నుండే తన కార్యాలయంలో లోకేష్ కోసం ఎదురు చూస్తున్నారు. అదికూడా రాజ్యాంగాధిపతి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ బడ్జెట్ ప్రసంగాన్ని గాలికి వదిలిపెట్టి మరీ. నిబంధనల ప్రకారం తమ ముహూర్తానికి నామినేషన్ దాఖలు చేయటం కుదరదని తెలుసుకున్న లోకేష్ బృందం చేసేదిలేక అప్పటికప్పుడు ఇంకో ముహూర్తాన్ని చూసుకుని నామినేషన్ వేసారు.