స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై హీరో రామ్ స్పందన వెనక....

By Siva KodatiFirst Published Aug 15, 2020, 3:25 PM IST
Highlights

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ఇప్పుడు రాజకీయమంతా రమేశ్ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రమేశ్ హాస్పిటల్ యాజమాన్యం హోటల్‌లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తేలింది

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులో ఇప్పుడు రాజకీయమంతా రమేశ్ హాస్పిటల్ చుట్టూనే తిరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా రమేశ్ హాస్పిటల్ యాజమాన్యం హోటల్‌లో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తేలింది. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై హీరో రామ్ స్పందించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే, రామ్ డాక్టర్ రమేష్ బాబు సోదరుని కుమారుడు. దానివల్లనే ఆయన రమేష్ ఆస్పత్రికి మద్దతుగా స్వర్ణ ప్యాలెస్ ఘటనపై స్పందించినట్లు అర్థమవుతోంది.

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకముందే అక్కడ కరోనా రోగులను ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక మరోవైపు ప్రమాదంపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన కమిటీ.. రమేశ్ హాస్పిటల్‌‌లో కరోనా చికిత్సను  రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది.

నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలిందని కమిటీ వెల్లడించింది. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన కేసులో అరెస్టయిన నిందితుల బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

రమేశ్ ఆసుపత్రి అధినేత డాక్టర్ రమేశ్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సోమవారానికి వాయిదా వేసింది. ఇకపోతే డాక్టర్ మమతను విచారించిన సందర్భంగా కీలక విషయాలను రాబట్టామన్నారు ఏసీపీ సూర్యచంద్రరావు.

అగ్నిప్రమాదం జరిగిన కోవిడ్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా మమత చూసుకున్నారని అన్నారు. ఆమె నుంచి సేకరించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని.. ఈ కేసులో మొత్తం పది మందికి నోటీసులు ఇచ్చినట్లు ఏసీపీ తెలిపారు.

వారందరినీ విచారణ చేయాల్సి వుందని అన్నారు. ఇకపోతే రమేశ్ హాస్పిటల్స్ అధినేత.. డాక్టర్ రమేశ్ బాబు స్వర్ణ ప్యాలెస్‌లో ఘటనపై వివరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్ని హాస్పిటల్స్‌ మాదిరిగానే సామాజిక బాధ్యతగా భావించి వైద్యం చేయడానికి ముందుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

రమేశ్ హాస్పిటల్స్‌కు కోవిడ్ సెంటర్లు నడిపేందుకు అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. నిష్పాక్షపతంగా న్యాయ విచారణకు రమేశ్ హాస్పిటల్ సిద్ధంగా వుందని డాక్టర్ రమేశ్ తెలిపారు.

డీఎంహెచ్‌వో పర్మిషన్‌తో ఫ్లాస్మా థెరపీని సైతం ఎంతోమంది రోగులకు అందజేశామని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని రమేశ్ వెల్లడించారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలోకి ఇప్పుడు కొత్తగా హీరో రామ్ పోతినేని వచ్చారు.

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం  దగ్గర పనిచేసే కొందరు ఈ వ్యవహారం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

స్వర్ణ ప్యాలెస్ హోటల్‌కు కనీసం మున్సిపల్ పర్మిషన్ కూడా లేదని.. కోవిడ్ పేషెంట్ల బిల్లింగ్ అంతా స్వర్ణ ప్యాలెస్ పేరు మీదే జరిగిందని రామ్ వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరుల్లో డాక్టర్ రమేష్ ఆస్పత్రికి చెందిన తమ అంకుల్ తనకు మాత్రమే కాకుండా తన మొత్తం కుటుంబానికి కూడా స్ఫూర్తి అని రామ్ అన్నారు.

click me!