
తిరుపతి పార్లమెంటు మాజీ సభ్యుడు చింతామోహన్ అంతరంగం అర్ధం కావటం లేదు. ఉండటానికి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనబడటం లేదు. కానీ రోజూ ప్రచారంలో మాత్రం ఉంటున్నారు. ఎందుకలా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేది అనుమానమే. ఎందుకంటే, ఇంకా విభజన దెబ్బనుండి కాంగ్రెస్ కోలుకోలేదు. అలా అని ఎన్నికలకు దూరంగా ఉండే టైపూ కాదు. అంటే వైసీపీలోకో లేక జనసేన లోకో వెళ్లవచ్చు. ఎందుకంటే, చంద్రబాబునాయుడును నిత్యం విమర్శిస్తూ, ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి టిడిపిలోకి వెళ్ళే అవకాశాలు లేవనే అనుకోవాలి.
వైసీపీకి తిరుపతి సిట్టింగ్ ఎంపి ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ తరపున టిక్కెట్టు వచ్చే అవకాశాలు తక్కువే. ఏమో తెచ్చుకున్నా తెచ్చుకోగలడు. అంతటి సమర్ధుడే. ఇక, జనసేన అంటారా? అసలు ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో కూడా అనుమానమే. సరే, కారణమేంటో తెలీదుకానీ మోహన్ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారో ఎవ్వరికీ అర్ధం కావటం లేదు. శనివారం విజయవాడలో మీడియాలో మాట్లాడుతూ, అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడలేదని మండిపడ్డారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ‘జాబు రావాలంటే బాబు రావల’ని ఊదరగొట్టిన చంద్రబాబు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.
బాబు సిఎం అయిన తర్వాత తన ఇంటివారికి మాత్రమే జాబులు ఇచ్చుకున్నట్లు ఎద్దేవా చేసారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. పోలవరం పేరు చెప్పి తండ్రి, కొడుకులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆరోపించారు. ఒకపుడు చెప్పులు కూడా లేకుండా తిరిగిన చంద్రబాబుకు ఇపుడు రూ. 2 లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడవని నిలదీసారు. ముద్రగడ శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటుంటే అడ్డుకోవటమేంటని ప్రశ్నించారు. డిజిపి పోలీసు బాసులాగ కాకుండా టిడిపి నాయకుడిలాగ మాట్లాడుతున్నట్లు అబిప్రాయపడ్డారు.
.