తప్పు చేస్తే జైలుకు పోవాల్సిందే...

First Published Jul 22, 2017, 9:03 AM IST
Highlights
  • అదే నిజమైతే ‘ఓటుకునోటు’ కేసులో తప్పుచేసింది ఎవరు? 
  • తనపై విచారణ జరపకుండా కోర్టుల్లో ఎందుకు స్టే తెచ్చుకుంటున్నారు సూత్రదారులు? 
  • కాంట్రాక్టర్లకు దోచిపెట్టటానికి అంచనా వ్యయాలను పెంచేయటం అవినీతికి క్రిందకు రాదా? 
  • పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) బయటపెట్టింది కదా?  ఎవరిపైన చర్యలు తీసుకున్నారు?

‘తప్పుచేసిన వారెవరైనా సరే జైలుకు వెళ్ళాల్సిందే..ముఖ్యమంత్రి అవినీతిని సహించరు. ఎవరు అవినీతికి పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తారు’..ఇది నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు లేండి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై అభియోగాలకు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై లోకేష్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పై వ్యాఖ్యలకు నిజంగా లోకేష్ కట్టుబడివుంటే గనుక అవే వ్యాఖ్యలు తన తండ్రికీ వర్తిస్తాయని మరచిపోయినట్లున్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. ఎవరూ కాదనేందుకు లేదు. అది జగన్ అయినా కావచ్చు ఇంకోరైనా కావచ్చు. మరి అదే నిజమైతే ‘ఓటుకునోటు’ కేసులో తప్పుచేసింది ఎవరు? ఆ కేసులో పట్టుబడిన పాత్రదారులు రేవంత్ రెడ్డి, సండ్రవెంకటవీరయ్యే అయినప్పటికీ వారిచేత తప్పు చేయించిన సూత్రదారులెవరో ప్రపంచం మొత్తానికి తెలుసు కదా?  మరి సూత్రదారులకు కోర్టు ఏమి శిక్ష విధించింది? తనపై విచారణ జరపకుండా కోర్టుల్లో ఎందుకు స్టే తెచ్చుకుంటున్నారు సూత్రదారులు? తానేతప్పు చేయలేదనుకుంటే ధైర్యంగా విచారణను ఎదుర్కొనవచ్చు కదా? లోకేష్ వ్యాఖ్యలు సూత్రదారులకు వర్తించవా?

అదేవిధంగా ముఖ్యమంత్రి అవినీతిని సహించరట. ఎవరు అవినీతికి పాల్పడ్డా కఠినంగా వ్యవహరిస్తారట. ఈ విషయాలు లోకేషే చెప్పాలి మరి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఎన్ని కుంభకోణాలు బయటపడలేదు? ఎవరిపైనైనా చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయా? ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వందలు, వేల కోట్ల అంచనాలు పెంచేసిందెవరి కోసం? కాంట్రాక్టర్లకు దోచిపెట్టటానికి అంచనా వ్యయాలను పెంచేయటం అవినీతికి క్రిందకు రాదా?

అంతెందుకు పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాత్తు కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) బయటపెట్టింది కదా?  ఎవరిపైన చర్యలు తీసుకున్నారు? విశాఖపట్నం జిల్లాలో భూకుంభకోణానికి పలువురు టిడిపి నేతలు పల్పడ్డారు కదా? అనకాపల్లి ఎంఎల్ఏ పీలా గోవింద్ పై పోలీసులు కూడా కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మిగిలిన వాళ్లపై ఎందుకు చర్యలు తసుకోలేదు? మూడేళ్ళ టిడిపి పాలనలో అడ్డదిడ్డంగ సంపాదించని నేతలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చేమో. మొత్తానికి నీతులు చెప్పటంలో తండ్రి బాటలోనే తనయుడు కూడా బాగానే నడుస్తున్నాడు.

 

click me!