
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో వున్నారు ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. సర్వేలు, తనకున్న సమాచారం ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తు వస్తున్న ఆయన వ్యతిరేకత వుంటే బంధువులు, ఆత్మీయులు, సన్నిహితులను సైతం పక్కనపెట్టేస్తున్నారు. కొందరికి టికెట్లు నిరాకరిస్తే.. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. మరికొందరిని నియోజకవర్గాలు కూడా మార్చేస్తున్నారు.
ఈ నెలాఖారు నాటికి పూర్తి అభ్యర్ధుల జాబితా ప్రకటించి.. ఇకపై పూర్తిగా ప్రజల్లోనే వుండాలని జగన్ కృతనిశ్చయంతో వున్నారు. తాజాగా ప్రకటించిన ఏడో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లను మార్చారు సీఎం వైఎస్ జగన్. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి టికెట్ నిరాకరించిన జగన్.. ఆయనకు బదులుగా ఇటీవలే పార్టీలో చేరిన పెంచలయ్య యాదవ్ కుమార్తె అరవింద యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా నియమించారు.
ఇక రాష్ట్రంలోని మరో కీలక నియోజకవర్గం పర్చూరులోనూ ఇన్‌ఛార్జ్‌ను మార్చారు. ఆమంచి కృష్ణ మోహన్‌కు బదులుగా యడం బాలాజీకి పర్చూరు బాధ్యతలు అప్పగించారు. 2014లో చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన బాలాజీ తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ కుదురుకోలేకపోయిన బాలాజీ.. అనంతరం అమెరికా వెళ్లిపోయారు. వైసీపీకి మద్ధతుదారుగా వున్న ఆయనకు జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశారు.
వాస్తవానికి ఆమంచి కృష్ణ మోహన్‌కు పర్చూరులో పోటీ చేయడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని పలుమార్లు జగన్, వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన బలం, బలగం మొత్తం చీరాలలోనే వుండగా.. ఇక్కడ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పర్చూరులో తనవల్ల కావడం లేదని కృష్ణ మోహన్ తేల్చేశారు. ఇక్కడ పోటీకి ఆసక్తి లేకపోవడంతో పాటు స్థానిక కేడర్ ఆమంచిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుండటంతో ఆయన తిరిగి చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు.
చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తాను కానీ తన కుమారుడు వెంకటేష్‌ను కానీ బరిలో దిగాలని భావిస్తున్నారు. చీరాల వైసీపీలో ఇప్పటికే కరణం, ఆమంచి, పోతుల గ్రూపులు వున్నాయి. వీరు ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చీరాలలో ఆమంచి కృష్ణ మోహన్ మద్ధతు లేకుండా వైసీపీ గెలవడం కష్టం. కాపు సామాజిక వర్గంతో పాటు చేనేత కులాలైన పద్మశాలి, దేవాంగ వర్గాలదే ఇక్కడ ఆధిపత్యం. ఆ వర్గాల్లో పట్టున్న ఆమంచి.. తనకు టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానంటున్నారు. గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆయనకు వుంది. చీరాలలో ఆమంచిని ఎలాగోలా బుజ్జగించినా.. మరి పర్చూరు సంగతేంటనేది వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు.
కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా వున్న పర్చూరు నుంచి కాపు నేతను బరిలోకి దింపాలనేది వైఎస్ జగన్ వ్యూహం. దీనిలో భాగంగానే ఆమంచిని అక్కడికి పంపారు. కానీ ఆయన చేతులెత్తేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బాలాజీని ఎంపిక చేశారు. ఆమంచి కృష్ణమోహన్ బలమైన నేత.. ఆయన చీరాల ఫలితాన్నే మార్చేయగలరు. అలాంటి వ్యక్తిని జగన్ వదులుకోరని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. చీరాలలో టికెట్ ఇచ్చేందుకే పర్చూరులో నిరాకరించారనే వాదన వినిపిస్తోంది.
ఆమంచికి చీరాల టికెట్ ఇస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం పరిస్ధితి ఏంటి అనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు.. తనకు టికెట్ దక్కితే సరే.. లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేందుకు కృష్ణ మోహన్ సిద్ధమవ్వడం ఖాయం. గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. ఒకవేళ ఆమంచి చేరతానంటే టీడీపీ, జనసేనలు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాయి. కృష్ణమోహన్ పార్టీ మారినా, స్వతంత్రంగా పోటీ చేసినా వైసీపీకి దెబ్బ మామూలుగా వుండదు.