చక్రం తిప్పుతోంది విజయసాయే..డౌట్ లేదు

First Published Mar 16, 2018, 5:00 PM IST
Highlights
  • జగన్ తరపున ఢిల్లీలో చక్రం తిప్పతున్నది విజయసాయే

చంద్రబాబునాయుడు మొదలుకుని మొత్తం తెలుగుదేశం నేతలందరూ అసూయ పడేలాగ వైసిపి తరపున ఢిల్లీలో చక్రం తిప్పుతోంది విజయసాయి రెడ్డే. పాదయాత్రలో అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకనే జగన్ తరపున హస్తినలో పార్టీ వ్యవహారాలు చక్క పెట్టటంలో విజయసాయి హడావుడిగా ఉన్నారు.

చంద్రబాబుకైనా, టిడిపి నేతలకైనా మొన్నటి వరకూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే మంటగా ఉండేది. ఏదో సందర్భం వచ్చినపుడు విజయసాయి ప్రస్తావన తెచ్చేవారంతే. అయితే, గడచిన నాలుగు రోజులుగా చంద్రబాబు నోరిప్పితే చాలు విజయసాయిపైనే మండిపడుతున్నారు.

ప్రధాన ప్రతిపక్షంలోని ఓ నేతపై అధికారపార్టీ అంతలా మండిపడుతున్నారంటేనే అర్ధమవుతోంది ఎంపి ఎంతలా పనిచేస్తున్నారో? టిడిపి నేతల అంచనా ప్రకారం బిజెపి-టిడిపి మధ్య ప్రస్తుత పరిస్ధితికి విజయసాయే కారణమట. కేంద్రమంత్రివర్గం నుండి టిడిపి ఎంపిలు బయటకు వచ్చేసినా, ఎన్డీఏతో తెగ తెంపులు చేసుకోవటానికి కూడా తెర వెనుక మంత్రాంగం నడిపింది విజయసాయే అని చంద్రబాబు అనుమానం.

ప్రత్యేకహోదా విషయంలో టిడిపి, బిజెపిలపై బాగా ఒత్తిడి పెరిగేలా క్షేత్రస్ధాయిలో జగన్ చేపట్టిన కార్యక్రమాలు, చేస్తున్న పాదయాత్ర ఒక ఎత్తు. అయితే, జగన్ పెంచుతున్న ఒత్తిడికన్నా తెరవెనుక నుండి రాజ్యసభ ఎంపి చేసిన మంత్రాంగం తక్కువేమీ కాదంటూ టిడిపి నేతలు శాపనార్ధాలు పెడుతున్నారు. జగన్ ను బిజెపికి దగ్గర చేయటంలో విజయసాయి కృషే ఎక్కువుందని టిడిపి నేతలు మండిపడుతున్నారు.

 విజయసాయిపై మీడియా సమావేశంలో చంద్రబాబు పదే పదే మండిపడుతున్నారంటేనే విజయసాయంటే ఎంతలా ఉలిక్కిపడుతున్నారో అర్ధమవుతోంది. 

జగన్ పై ఉన్న కేసులు వీగిపోతుండటంలోను, బిజేపిని జగన్ కు దగ్గర చేయటంలోనూ విజయసాయే కీలక పాత్ర పోషించినట్లు టిడిపి అనుకూల మీడియానే బాహాటంగా ప్రచారం చేస్తోంది. అంటే విజయసాయి ఏ స్ధాయిలో జగన్ కు ఢిల్లీలో ఉపయోగపడుతున్నారో అర్ధమవుతోంది. 

click me!