సెంటిమెంటునే నమ్ముకున్నట్లున్నారు?

First Published Aug 5, 2017, 4:37 AM IST
Highlights
  • సెంటిమెంటును పండిస్తే అన్నా ఓట్లు రాలుతాయేమో అని ప్రయత్నిస్తున్నారు.
  • అందుకే వ్యాహాత్మకంగా తన తల్లి మరణాన్ని తెరపైకి తెచ్చారు.
  • వైఎస్ షర్మిల కోసం వెళ్లి తిరిగి వస్తున్నపుడు జరిగిన ప్రమాదం వల్లే తన తల్లి శోభా నాగిరెడ్డి మరణించిందని చెప్పారు.
  • మరణించేముందు వారు ఎవరెవరినైతే కలిసారో వారంతా కారకులే అనటంలో ఏమన్నా అర్ధముందా?

నంద్యాలలో గెలవటానికి అఖిలప్రియ ఆఖరుకు సెంటిమెంటునే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. సెంటిమెంటును పండిస్తే అన్నా ఓట్లు రాలుతాయేమో అని ప్రయత్నిస్తున్నారు. అందుకే వ్యాహాత్మకంగా తన తల్లి మరణాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్ షర్మిల కోసం వెళ్లి తిరిగి వస్తున్నపుడు జరిగిన ప్రమాదం వల్లే తన తల్లి శోభా నాగిరెడ్డి మరణించిందని చెప్పారు. శోభ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తల్లి మరణానికి, అంతకుముందు షర్మిలను కలవటానికి ఏంటి సంబంధమో అర్ధం కావటం లేదు.

శోభానాగిరెడ్డి గట్టి నాయకురాలనటంలో ఎవరికీ సందేహం లేదు. ఆమె ఏ పార్టీలో ఉన్నా గెలుస్తున్నారంటేనే వ్యక్తిగతంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎంత పట్టుందో అర్ధమవుతోంది. శోభకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నపుడు జరిగిన ప్రమాదంలోనే శోభ మరణించారు. ఆ విషయాన్ని వదిలేసి తన తల్లి మరణానికి షర్మిలే కారణమని చెప్పటంలో మంత్రి తన అపరివపక్వతను తానే బయటపెట్టుకున్నారు.

ప్రమాదంలో మరణించటానికి ముందు అనేకమంది అనేకమందిని కలుస్తుంటారు. అంటే, మరణించేముందు వారు ఎవరెవరినైతే కలిసారో వారంతా కారకులే అనటంలో ఏమన్నా అర్ధముందా? ఒకవేళ అఖిల చెబుతున్నదే నిజమని అనుకుందాం. మరి నాగిరెడ్డి మరణానికి కారణమెవరు?  తండ్రి భూమా నాగిరెడ్డి కూడా హటాత్తుగానే కదా మరణించింది? నంద్యాలలో తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. నాగిరెడ్డికి ఎందుకు గుండెపోటు వచ్చింది?

అంతకుముందు రోజు రాత్రి చంద్రబాబునాయుడును నాగిరెడ్డి విజయవాడలో కలిసారు. ఫిరాయింపుల సమయంలో మంత్రి పదవిపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటంలో చంద్రబాబు మాట తప్పారు. ఆ విషయమ్మీదే చంద్రబాబు-నాగిరెడ్డిల మధ్య వాగ్వాదం నడిచిందని ప్రచారం కూడా జరిగింది. మంత్రిపదవి ఇవ్వకపోగా ఎంఎల్సీ సీటును గెలిపించే బాధ్యతను కూడా నాగిరెడ్డి మీదే చంద్రబాబు మోపారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న నాగిరెడ్డి వెంటనే నంద్యాలకు వెళ్ళిపోయారు. ఆ విషయంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన నాగిరెడ్డి తెల్లవారుజామున గుండెపోటు వచ్చి మరణించారు. నాగిరెడ్డి మరణానికి ముందు కలిసింది చంద్రబాబునే కాబట్టి తన తండ్రి మరణానికి చంద్రబాబే కారణమని అఖిల ఒప్పుకుంటారా?

అఖిలప్రియ పరిస్ధితి చూస్తుంటే అయ్యో అనిపించకమానదు. ఎందుకంటే, ఒకవైపేమో టిడపిలోని తండ్రి శతృవులు. ఇంకోవైపేమో వైసీపీ తరపున బలమైన ప్రత్యర్ధి. మరోవైపు ఏమాత్రం అనుభవం లేని సోదరుడే అభ్యర్ధి. వీటికి తోడు చంద్రబాబు ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత. ఇన్ని సమస్యల నడుమ సోదరుడి విజయంపై అందరిలోనూ అనుమానాలే. ఏం చేస్తే సోదరుడు గెలుస్తాడో మంత్రికి  అర్ధం కావటం లేదు. అందుకే సెంటిమెంటును రాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

click me!