
ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఆవేదనను ఎవరైనా పట్టించుకుంటారా? నో ఛాన్స్. ఎందుకంటే, ఇక్కడ చంద్రబాబునాయుడైనా ఢిల్లీలో భాజపా అయినా ఒకే తాను ముక్కలే కదా? చంద్రబాబు పాల్పడుతున్న అప్రజాస్వామిక విధానాలకు, ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ స్ధాయిలో ఫిర్యాదులు చేయటానికి నాలుగు రోజుల పాటు పార్టీ నేతలతో కలిసి మకాం వేస్తున్నారు. చంద్రబాబుపై ఎవరికి జగన్ ఫిర్యాదు చేస్తారు? మొదటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి. విని రాష్ట్రపతేం చేస్తారు? ఎందుకంటే జూలైలో ప్రణబ్ పదవి నుండి దిగిపోతున్నారు.
ఇక, అపాయింట్మెంట్ ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా కలుస్తారట. మోడి మాత్రం ఏం చేస్తారు. మోడి దన్ను చూసుకునే కదా చంద్రబాబు ఫిరాయింపులకు పాల్పడుతున్నది. మోడి ప్రధానిగా బాధ్యతలు తీసుకునేటప్పుడే శివసేనకు చెందిన ఎంపి సురేష్ ప్రభును పార్టీలో నుండి లాక్కుని మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే కదా. తర్వాత కూడా ఉత్తరాఖండ్, మణిపూర్లో ఏం జరిగింది? మోడికి తెలిసే కదా ఫిరాయింపులకు పాల్పడింది. మొన్నటి ఎన్నికల తర్వాత గోవా, మణిపూర్లో సంఖ్యాపరంగా మైనారిటీలో ఉన్నా భాజపా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసింది. మోడి డైరెక్షన్ ప్రకారమే జరిగింది మొత్తం.
ఎలాగైనా సరే అధికారం అందుకోవటమే మోడి, అమిత్ షాల లక్ష్యం. వారి బాటలోనే చంద్రబాబు కూడా నడుస్తున్నారు. ఈ విషయాలు అన్నీ అందరికీ తెలిసిందే. ఇక, ప్రతిపక్షాలంటారా? జగన్ మాట విని ఏం చేయగలవు. వాటి రాష్ట్రాల్లోనే ఆ పార్టీలు ఏం చేయలేకపోతున్నాయి. ఇక, జగన్ కు ఏ విధంగా సాయం చేస్తాయి. కాకపోతే, పార్లమెంట్ లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రస్తావన తేగలవంతే. దాని వల్ల ఇక్కడ చంద్రబాబుకు ఏం కాదు. మహా అయితే, జాతీయ మీడియాలో బాగా చంద్రబాబుకు వ్యతిరేకంగా కవరేజ్ రావచ్చంతే. కాకపోతే అంశాన్ని జాతీయ స్ధాయిలో ప్రస్తావనకు తెచ్చిన తృప్తి తప్ప జగన్ కు ఇంకేమీ మిగలదు.
జగన్ కు మద్దతుగా నిలవాలంటే రాష్ట్రప్రజల వల్లే సాధ్యం. చంద్రబాబు పాల్పడుతున్న ఫిరాయింపులు తప్పుకాదనుకుంటే చంద్రబాబుకు మద్దతుగా నిలబడతారు. చంద్రబాబు చేస్తున్నది తప్పనుకుంటే జగన్ కు మద్దతుగా నిలుస్తారు. ఏమైనా తేలాల్సింది మాత్రం రాష్ట్రంలోనే.