టిడిపిలో జోరుగా ఓదార్పు యాత్రలు

First Published Apr 5, 2017, 1:47 PM IST
Highlights

తెలుగుదేశంలో కూడా ఇపుడు ఓదార్పుయాత్రలు మొదలయ్యాయి. మంత్రి  పదవి రాక భంగపడిన వారిని,  పదవి పోయి పరాభవంతో ఉన్న  నాయకులను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓదార్పు యాత్రలు జరిపిస్తున్నారు.

తెలుగుదేశం లో కూడా ఇపుడు ఓదార్పుయాత్రలు మొదలయ్యాయి. క్యాబినెట్ మంత్రి పదవి అశించి భంగపడిన వారిని, పదవి పోయి పరాభవంతో ఉన్న సీనియర్ పార్టీ  నాయకులను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓదార్పు యాత్రలు జరిపిస్తున్నారు. తాను జరపడం యోగ్యం కాదు కాబట్టి తమ్ముళ్ల తో ఈ యాత్రలు జరిపిస్తున్నారు.  వారి ద్వారా వరాల మూటలు కూడా పంపిస్తున్నారట. మొదట్లో కొంత బెట్టుచేసిన మెల్లిమెల్లిగా అలిగిన తమ్ముళ్లు దారికొస్తారని టిడిపివర్గాలు ఆశిస్తున్నాయి.

 

 ఇలా మంత్రి పదవి రాక నిరాశకు గురయిన వారిలో విశాఖ జిల్లా పెందుర్తి శాసన సభ్యుడు బండారు సత్యనారాయణ కూడా ఉన్నారు. జిల్లా టిడిపి వ్యవహారాలలోసీనియర్ సభ్యుడిగా ఆయన చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు కూడా ఆయన విధేయంగా అధ్యక్షుడు చంద్రబాబు తోనే ఉన్నారు.తన సీనియారిటీకి గుర్తింపు వస్తుందని , తనకు మంత్రి పదవి ఇచ్చి ముఖ్యమంత్రి గౌరవిస్తారని ఆయన భావించారు. భంగపడ్డారు.

 

ఇపుడాయను ఓదార్చేందుకు పార్టీ నాయకత్వం అనకాపల్లి లోక్  సభ సభ్యుడు ముత్తం శెట్టి శ్రీనివాస్ రావును, ఆయనకు అంతగా ఇష్టంలేని గంటా శ్రీనివాసరావును ఓదార్పు యాత్రకు పంపించింది. అయితే, సత్యనారాయణకు ఇది ఓదార్పు, ఉపశమనం కల్గించడం కాదు, మరింత అవమానించిందని ఆయన  అనుచరులంటున్నారు. ఎందుకంటే, ముత్తంశెట్టి చాలా జూనియర్. ఒక అనుచరుడి మాటల్లో చెబితే, ‘ మా సార్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి ముత్తం శెట్టి పుట్టనే లేదు.’ బండారు కు పార్టీలో సముచిత గౌరవం దక్కేలా చూస్తానని  ఈ రోజు ఆయన సత్యనారాయణను కలుసుకుని  ఓదార్చారు. బండారును ఓదార్చేందుకు వచ్చిన మరొక నాయకుడు గంటా శ్రీనివాసరావు. పార్టీలన్నీ మారినా, మంత్రి పదవికొట్టేసిన గంట పార్టీని అంటిపెట్టుకున్నబండారుకు హామీ ఇవ్వడమేమిటని అనుచరులన ప్రశ్న.

 

 ఇలాగే మరొక  సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య  చౌదరిని సముదాయించేందుకు హోంమంత్రి నిమ్మకాయల చిన్న  రాజప్పను ఓదార్పు యాత్రకు పంపించారు.

 

గుంటూరుఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటికి ఎంపిలు కొనకళ్ల నారాయణ, కేశినేని ఓదార్పు యాత్రకు వెళ్లారు.

 

పదవిపోయిన పరాభవంతోఉన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇంటికి మంత్రి గంటా శ్రీనివాస రావు, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్ వెళ్లారు. ఈ యాత్రల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ప్రతిచోట దూతలకు ఛేదు అనుభవాలే ఎదురయ్యాయినా  ముఖ్యమంత్రి తరఫున అందరికీ భారీ వరాల హామీ లిచ్చినట్లు సమాచారం. ఫలితాలెలా ఉంటాయో చూడాలి.

 

 

 

click me!