పోలవరంలో జగన్ అవినీతి బయటపెడతామంటున్న టీడీపీ... త్వరలోనే శ్వేతపత్రం విడుదల

By Galam Venkata Rao  |  First Published Jun 20, 2024, 2:36 PM IST

గత ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఏడాదిలో పూర్తవ్వల్సిన పోలవరం ప్రాజెక్టును పదేళ్లు వెనక్కి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టులను ప్రధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడైన జాతీయ ప్రాజెక్టైన పోలవరం ప్రాజెక్టు ఏడాది లోగా పూర్తి కావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనులను అస్తవ్యస్తం చేసి పదేళ్లు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాకులో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యంగా ఏడాది వ్యవధిలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. అలాగే, 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం రీఇంబర్స్‌మెంట్ కింద విడుదల చేసిన నిధులను వేరే అవసరాలకు మళ్లిచిందన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుస్తోందన్నారు. 

పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయఫ్రమ్ వాల్ కొట్టుకు పోయిందని హైదరాబాదు ఐఐఐటి నీతి ఆయోగ్‌కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. డయాఫ్రం వాల్‌కు తిరిగి మరమ్మతులు చేయాలంటే కనీసం రూ.440 కోట్లు ఖర్చు అవుతుందని, కొత్తగా నిర్మించాలంటే సుమారు రూ.990 కోట్లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి రామానాయుడు వెల్లడించారు. దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మత్తులు చేయాలా లేక కొత్తగా నిర్మించాలా అనేదానిపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Latest Videos

రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉప శమనం కలిగించేందుకు వీలుగా వివిధ ఏటిగట్లు పటిష్టీకరణ, షట్టర్లు, గేట్లు లాంటివాటి మరమ్మతుల నిర్వహణ, వాటి పటిష్టీకరణకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్క, పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశామన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల లాకులు, షట్టర్లకు మరమ్మతులు చేయలేదని.... కనీసం గ్రీజు కూడా పూయలేదని రామానాయుడు ఆరోపించారు.

అంతకుముందు జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామానాయుడికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ సలహాదారు పూర్వపు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సీహెచ్ శ్రీధర్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

click me!