కాపు ఉద్యమ నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది. ఎన్నికల సమయంలో సవాల్ చేసినట్లు ఆయన పేరును రెడ్డిగా మార్చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ముద్రగడ పద్మనాభం అన్నంత పని చేశారు. ఎన్నికల ముందు చేసిన సవాలును నిలబెట్టుకున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక గెజిట్ విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. అధికార, విపక్ష పార్టీల మాటల యుద్ధయే సాగింది. గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో ముందుకుసాగుతూ రాజకీయ పార్టీల తమ వద్ద ఉన్న అస్త్రాలను ప్రయోగించాయి. ఈ క్రమంలో జంపింగ్ జపాంగ్‌లు బాగా పెరిగిపోయారు. విపక్షంలో వారు అధికార పార్టీలోకి, అధికార పార్టీలో వారు విపక్ష పార్టీల్లోకి జంప్ చేశారు.
ఆ తరుణంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ, బీజేపీతో పొత్తుపై స్పష్టత రాకముందు పవన్ కల్యాణ్‌కు అనేక సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పవన్‌ను చూడాలని ఉందని కూడా మాట్లాడారు. అయితే, టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణే వచ్చి కలిస్తే తాను జనసేనలోకి వెళ్లాలని భావించారు ముద్రగడ. అయితే, జనసేన తీసుకున్న సీట్లు, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు పేరును ప్రకటించడం నచ్చని ముద్రగడ పద్మనాభం... అనూహ్యంగా వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరింది మొదలు... జనసేన, పవన్ కల్యాణే లక్ష్యంగా నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టారు. పవన్ కల్యాణ్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఘాటు లేఖలు కూడా రాశారు. కాపులు జనసేన వైపు మళ్లకుండా ఉండేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు. ఒకానొక దశలో చిరంజీవిపైనా విమర్శలు చేశారు. అయితే, ముద్రగడ పాచికలేవీ పారలేదు.
ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరుతామని... తన అనుచరుల సమక్షంలో ప్రకటించారు. లేదంటే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. అనూహ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ ఘన విజయం సాధించింది. జనసేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇక, ముద్రగడ ట్రోల్స్ మొదలయ్యాయి. అసలే జనసైనికులను ఆపలేరు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్‌ను బలహీనపర్చడమే టార్గెట్‌గా పనిచేసిన ముద్రగడను ఎందుకు వదులుతారు. విపరీతగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే, ముద్రగడ ఎవరూ ఊహించని విధంగా మీడియా ముందుకు వచ్చి.. తాను సవాల్‌కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ముద్రగ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు. ఆయన అన్నట్లుగా ముద్రగడ పద్మనాభం పేరు చివరి రెడ్డి కలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా గెజిట్ విడుదలైంది.