
కొన్ని ఘటనలు యాధృచ్చికమే అయినా నేతల మధ్య పోలికలు తెస్తాయి. తమిళనాడులో జరిగిన, ఏపిలో జరిగిపోయిన ఘటనలను జ్ఞప్తికి తెస్తుంది. తమిళనాడులో శశికళకు, ఏపిలో జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సారూప్యతలు కనిపిస్తున్నాయి. ఇద్దరిదీ ఒకేదారి. ఇద్దరిదీ ఒకే ప్రయత్నం. ఇద్దరి విషయంలోనూ ఫలితమొకటే. ఆపై ఇద్దరి గమ్యం కూడా ఒకటే కావటం ఇంకా విచిత్రం.
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత సిఎం ఎవరనే విషయంలో పార్టీలో చర్చ మొదలైంది. వైఎస్ వారసునిగా ఆస్తులకే కాదు పదవులకు కూడా తానే వారసుడినంటూ జగన్ సిద్ధపడ్డారు. దాంతో మెజారిటీ ఎంఎల్ఏలు ఆయన్నే సిఎంగా అనుకున్నారు. 140 మంది ఎంఎల్ఏలు జగన్ కు మద్దతుగా సంతకాలు చేసి అధిష్టానానికి ఓ లేఖ పంపారు. అయితే సోనియాగాంధీ మాత్రం రోశయ్య వైపు మొగ్గుచూపింది. దాంతో అధిష్టానం నిర్ణయంతో జగన్ విభేదించారు. పార్టీలోని తన వర్గంతో అధిష్టానానికి ఎదురుతిరిగారు.
అటు అధిష్టానానికి ఇటు జగన్ కి మధ్య రాయబారాలు నడిచాయి. జగన్ కు కేంద్రంలో మంత్రిపదవి ఇస్తామని అధిష్టానం ప్రతిపాదించినట్లు కూడా ప్రచారం జరిగింది. అయినా జగన్ ఒప్పుకోలేదు. కొద్ది రోజుల తర్వాత సోనియానే ధిక్కరించి జగన్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఎప్పుడైతే జగన్ పార్టీ నుండి బయటకు వచ్చేసారో తర్వాత జగన్ తండ్రి అధికారన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జన చేసారంటూ కోర్టులో కేసులు దాఖలయ్యాయి. దాంతో స్పందించన కోర్టు విచారణకు ఆదేశించటం, రంగంలోకి దిగిన సిబిఐ జగన్ను అరెస్టు చేయటం తెలసిందే. ప్రస్తుతం జగన్ బెయిలుపై ఉన్నారు.
శశికళ విషయంలో కాస్త అటు ఇటుగా ఇదే విధంగా జరిగింది. కాకపోతే శశికళపై ఉన్న ఆదాయానికి మించిన కేసులు 20 ఏళ్ళనాటివి. అయితే, జయలలిత మరణం తర్వాత తానే సిఎం కావాలని చిన్నమ్మ అనుకున్నది. మెజారిటీ ఎంఎల్ఏల మద్దతూ ఉంది. అయినా పన్నర్ సెల్వం సిఎం అయ్యారు. పన్నీర్ ను దింపేసి తాను సిఎం అవుదామని చిన్నమ్మ రెండోసారి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండోసారి గవర్నర్ రూపంలో కేంద్రం అడ్డుపడింది. ముఖ్యమంత్రి పదవి కోసం చిన్నమ్మ శతవిధాలా ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. ఇంతలో అక్రమ సంపాదన కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడటంతో చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, జగన్కు శశికళకు ఓ చిన్న తేడా ఉంది. ఆదాయానికి మించిన కేసులో జగన్ ముద్దాయి మాత్రమే. శశికళ దోషిగా నిరూపితమైంది.