పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ.. అధికారులు టీడీపీకి సహకరిస్తున్నారు : ఈసీకి వైసీపీ అభ్యర్ధి ఫిర్యాదు

By Siva KodatiFirst Published Mar 17, 2023, 9:11 PM IST
Highlights

అధికారులు టీడీపీకి సహకరిస్తున్నారంటూ.. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఓట్లను అధికారులు టీడీపీ అభ్యర్ధికి కలుపుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. క్షణానికి ఆధిక్యం మారుతూ వుండటంతో అభ్యర్ధులతో పాటు పార్టీ నేతలు సైతం టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల (పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పై వైసీపీ అభ్యర్ధ రవీంద్రా రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని ఈసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఓట్లను అధికారులు టీడీపీ అభ్యర్ధికి కలుపుతున్నారని రవీంద్రా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అటు తెలుగుదేశం నేతలు కూడా వైసీపీ నేతలకు ధీటుగా బదులిస్తున్నారు. ఓటమి భయంతోనే కౌంటింగ్ నిలిపివేయాలని వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టర్‌ కాకుండా జాయింట్ కలెక్టర్ ద్వారా కౌంటింగ్ పర్యవేక్షణ చేయించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. మెజారిటీ తగ్గడంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని తామే గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా పశ్చిమ రాయలసీమ విషయానికి వస్తే.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్ధి రవీంద్రారెడ్డికి 74,678 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డికి 73,229 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం వైసీపీ అభ్యర్ధి 1,449 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

ALso REad: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ జోరు.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

ఇదిలావుండగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి ఆధిక్యంలో వుండటంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలను ఇక్కడి ప్రజలు నమ్మలేదని అచ్చెన్నాయుడు అన్నారు. తమకు కావాల్సింది రాజధాని కాదని, అభివృద్ధి అని ప్రజలు తేల్చిచెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే..  జగన్‌కు కర్రు కాల్చి వాత పెట్టిన విధంగా వున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికి తిరిగి మూడు రాజధానుల గురించి ప్రచారం చేశారని.. కానీ ప్రజలు మాత్రం తమకు అభివృద్ధే కావాలని తేల్చిచెప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు చోట్ల టీడీపీ విజయం సాధించిందని.. మూడో స్థానంలోనూ తమనే విజయం వరిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 

click me!