కారణమిదే: చింతమనేనిపై కేసు నమోదు

By narsimha lodeFirst Published Sep 21, 2018, 10:43 AM IST
Highlights

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై  ఏలూరు త్రీటౌన్‌పై  పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై  ఏలూరు త్రీటౌన్‌పై  పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే అనుచరులు రవి, చుక్కా వెంకటేశ్వర్‌రావుతో పాటు  ముగ్గురు గన్‌మెన్లపై  కేసు నమోదు చేశారు.

ఏలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఐఎంఎల్ డిపో హమాలీ మేస్త్రీ రాచీటి జాన్‌ను ఎమ్మెల్యే ప్రభాకర్ తన ఇంటికి పిలిపించుకొని కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై  కార్మిక, దళిత సంఘాలు వామపక్షాలు పదిరోజులుగా ఆందోళన చేయడంతో  పోలీసులు కేసు నమోదుచేశారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఐఎంఎల్‌ డిపోలో ఓ హమాలీ సక్రమంగా పనిచేయక పోవటంతో హమాలీ మేస్త్రి రాచీటి జాన్‌ అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే చింతమనేని మేస్త్రి జాన్‌ను ఇంటికి పిలిపించి పంచాయితీ పెట్టారు. 

తొలగించిన కార్మికుడిని తిరిగి పనిలో పెట్టుకోవాలని హుకుం జారీ చేశారు. తమ కార్మిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అతడిని పనిలో పెట్టుకోవటం కుదరదని జాన్‌ చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చింతమనేని దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

 ఈనెల 10న సంఘటన జరగగా 11న కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు, బాధితుడు జాన్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ఈనెల 14 వరకూ పోలీసులు కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. కేసు నమోదు చేయకపోవటంపై వామపక్ష పార్టీలు, కార్మిక, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాయి. 

చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. గురువారం ఉదయం  కలెక్టరేట్‌ వద్ద రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం త్రీటౌన్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐపీసీ 323 కింద కేసు నమోదు చేశారు. 

click me!