రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో భారీ నుండి అతి భారీ వర్షాలు

By Arun Kumar PFirst Published Jul 22, 2021, 11:01 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని సూచించింది. 

అమరావతి: వాయువ్య బంగాళఖాత పరిసరాల్లో జూలై 23న అంటే రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లొద్దని, తీరప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. 

ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి జలకళను సంతరించుకున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. తాజా అల్పపీడనంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. 

అతి భారీ వర్షాల హెచ్చరికతో మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ రక్షణ సిబ్బంది ముంపు ప్రాంతాలకు  తరలిస్తున్నారు. విశాఖపట్నంకు రెండు, పోలవరం సమీపంలోని దేవీపట్నంకు రెండు, తెలంగాణలోని భద్రాచలం కు ఒక బృందాన్ని తరలించారు. కర్ణాటక రాష్ట్రానికి కూడా నాలుగు టీంలు తరలించారు. ఇక అప్పటికప్పుడు తరలించడానికి ముందుజాగ్రత్తగా మరో నాలుగు టీంలు ఏర్పాటుచేశారు.   

read more  ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు... అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక (వీడియో)

ఇక తెలంగాణ రానున్న మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే  అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ, రేపు(గురు, శుక్రవారం) ఉరుములు,మెరుపులో కూడిని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

గురు, శుక్రవారాల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

 
 


 

click me!