పసికందు తండ్రికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాదాలు ఉన్నాయి అని తెలిసింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఉయ్యాలలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.
గుంటూరు : మాచెర్ల పరిధిలోని ఓ గ్రామంలో ఏడు నెలల పసికందును గాయపరిచి ముళ్లపొదల్లో పడేయడం పై విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పసికందుపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఈ ఘటనపై నరసరావుపేట డిఎస్పీ రవిచంద్ర, ఎస్సై ఉదయ లక్ష్మితో పాటు పోలీసు సిబ్బంది బుధవారం విచారణ చేపట్టారు. పసికందును పడేసిన స్థలాన్ని పరిశీలించారు.
ఏం జరిగి ఉంటుంది? ఎవరెవరి పై అనుమానాలు ఉన్నాయి? అనే దానిపై వివరాలు రాబట్టారు. పసికందు తండ్రికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాదాలు ఉన్నాయి అని తెలిసింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న ఆ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో వచ్చి ఉయ్యాలలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.
చిన్నారి ఒంటిపై పంటి గాట్లు ఎవరు పెట్టారు? కావాలనే నిందితుడు గాయపరిచాడా? అన్న కోణంలోనూ విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు పాపను అపహరించినట్లు అనుమానిస్తున్న వ్యక్తి తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విజయపురిసౌత్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసు విషయంలో అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, అఘాయిత్యం జరిగిన నా చిన్నారి మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏడు నెలల పసిబిడ్డను మంగళవారం రాత్రి గుంటూరు జిజిహెచ్ న్యూరో సర్జరీ విభాగంలో చేర్పించారు.
వైద్య పరీక్షల అనంతరం మెదడులో రక్తస్రావం జరిగి గడ్డ కట్టినట్లు తెలుసుకున్నారు. దీనికి శస్త్ర చికిత్స చేయడానికి అవకాశం లేదని, కేవలం ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మెదడులో సమస్య తలెత్తినా ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఈ దశలో ఏమీ చెప్పలేమని నిపుణులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా పసికందు పై లైంగిక దాడికి పాల్పడ్డారు అనే విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ప్రస్తుతం న్యూరోసర్జరీ పీడియాట్రిక్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.