Telangana Rains: తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
Andhra Pradesh Rains: రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది . తేలికపాటి నుంచి మోస్తరు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.
తెలంగాణలో..
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలుచోట్ల వర్షం కురుసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఆకాశం మబ్బులతో నిండిపోయింది.
ఆంధ్రప్రదేశ్ పై అల్పపీడన ప్రభావం..
తమిళనాడు మీదుగా పశ్చిమ దిశగా కదులుతున్న తుఫాను ప్రభావంతో దక్షిణ భారతంలోని దక్షిణ ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే వాతావరణం కొనసాగితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదనంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచించారు.