Vijayawada: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. కోనసీమ జిల్లా కొత్తపేట పర్యటనలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన.. వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును సైతం అందించారు.
Jana Sena Party PAC chairman Nadendla Manohar: తెలుగుదేశం పార్టీ (టీడీపీ)-జనసేనలు ఉమ్మడి ప్రాణాళికతో ముందుకు సాగనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బుధవారం (అక్టోబర్ 18) నుంచి రెండు రోజుల పాటు సాగే తన పర్యటనలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇటీవల వివిధ కారణాలతో మరణించిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా కోనసీమ జిల్లా కొత్తపేట పర్యటనలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును సైతం అందించారు.
ఈ క్రమంలోనే నాదేండ్ల మనోహర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ (టీడీపీ)-జనసేన పొత్తులు, కలిసి ముందుకు సాగడం వంటి అంశాలను ప్రస్తావించారు. టీడీపీ-జనసేనలు రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు నడవబోతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ఉమ్మడి ప్రణాళిక సిద్ధమవుతుందనీ, ఇంటింటి ప్రచార కార్యక్రమంతో మొదలుపెడతామని చెప్పారు. ఇదే క్రమంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారనీ, వైఎస్ఆర్సీపీ సర్కారు విముక్తి కోసం ఏపీ ప్రజలంతా ఏకమవుతున్నారని తెలిపారు.
ఇదిలావుండగా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగాలా వద్దా అనే విషయంపై సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. తనపై ఒత్తిడి ఉందని కల్యాణ్ పార్టీ నేతలకు చెప్పారు. కానీ, దీనిపై పూర్తి వివరణ ఇవ్వలేదు. ఈ విషయాన్ని అక్టోబర్ 17న జనసేన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. నేతల అభిప్రాయాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను గౌరవిస్తానని చెప్పారు. "నాపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవం. ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వండి' అని మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో తనను కలిసిన నేతలతో అన్నారు. తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేతలతో ఆయన చర్చలు జరిపారు. అయితే, తాజగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.