
డల్లాస్: బలమైన సంకల్పం, సమాజానికి ఏదో చేయాలనే తపన సమాజంలో మార్పు తీసుకోస్తోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.
అమెరికాలోని డల్లాస్‌లో డాక్టర్లతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.మానవత్వంతో సేవ చేయడమే తప్ప రాజకీయాలు తెలియదని ఆయన చెప్పారు. చిన్న వయసులో సమాజంలో బాధలు, కన్నీళ్లు తప్ప అనందం కన్పించేది కాదన్నారు. ఎవరూ ఏం చేయడం లేదని చాలా అసహనం ఉండేదన్నారు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు సతమతమౌతున్నారని ఆయన గుర్తు చేశారు. వాటర్ ఫ్లాంట్ పెట్టాలనుకొంటే రాజకీయ నాయకులు అనేక అడ్డంకులు సృష్టించారన్నారు.
మానవత్వంతో సేవ చేయడానికి కూడ సగటు రాజకీయ వ్యవస్థ అడ్డు చెప్పిందన్నారు. 2009 ఎన్నికల్లో ఓ అంధురాలు గుక్కెడు మంచినీళ్లు ఇప్పించాలని తనను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆ తండాలో బోర్ వేయిస్తే నీళ్లు పడ్డాయని చెప్పారు.
మంచి పనిచేస్తే ప్రకృతి కూడ సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఖుషీ సినిమా తర్వాత 10 ఏళ్ల పాటు నరకం చూశానని పవన్ ప్రస్తావించారు.గబ్బర్‌సింగ్ సినిమా ద్వారా తిరిగి శక్తిని పొందానని పవన్ కళ్యాణ్ తెలిపారు.కష్టాలు, సమస్యలన్నీ గమ్యాన్ని దూరాన్ని నెట్టివేస్తాయన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హార్వర్డ్ నుండి డాక్టర్లను పిలిపించామన్నారు.కానీ, ఈ రాజకీయ వ్యవస్థలో కిడ్నీ సమస్య పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లకపోయామని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్దానం బాధితుల కోసం పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భావించినట్టు తెలిపారు. ప్రజలకు అన్నీ చేస్తే ఓట్లు వేయరనే భావన కారణంగానే ఉద్దానం లాంటి సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.వైద్యులను భగవంతుడితో సమానంగా భావిస్తున్నట్టు చెప్పారు. డాక్టర్లను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటుందని పవన్ హామీ ఇచ్చారు.
తమ పార్టీ మేనిఫెస్టోలో కూడ డాక్టర్లకు పెద్దపీట వేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్రామాల్లో పనిచేసే డాక్టర్లకు రెట్టింపు జీతాలు, మండల కేంద్రాల్లో గృహ సముదాయాలు నిర్మిస్తామన్నారు. సమాజానికి సేవ చేయడానికి ప్రవాస వైద్యుల కోసం ఎన్ఆర్ఐ డాక్టర్ల విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.