ఏపీపై మొదలైన పెథాయ్ ప్రభావం... తీరంలో హై అలర్ట్

By sivanagaprasad kodatiFirst Published Dec 16, 2018, 10:53 AM IST
Highlights

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’  తుఫాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. అత్యంత వేగంగా కోస్తాంధ్ర వైపు దూసుకోస్తున్న ఈ తుఫాను.. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోంది. 

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’  తుఫాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. అత్యంత వేగంగా కోస్తాంధ్ర వైపు దూసుకోస్తున్న ఈ తుఫాను.. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారబోతోంది. ఇవాళ సాయంత్రం ఇది కాకినాడ-విశాఖ మధ్య తీరం దాటనుంది.

ప్రస్తుతం ‘‘పెథాయ్’’  కాకినాడకు 670 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణా ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.. ఇది ఉత్తర వాయువ్యంగా పయనిస్తూ సోమవారం సాయంత్రం తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

‘పెథాయ్’’ ప్రభావంతో ఆది, సోమవారాల్లో గంటకు 80 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

తీర ప్రాంతాల్లో కెరటాలు 6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. తుఫాను తీరం దాటే వరకు జనం ఇళ్లలోనే ఉండటం మంచిదని వాతావరణ శాఖ సూచించింది. ‘‘పెథాయ్’’ తీవ్రత దృష్ట్యా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.

తీర ప్రాంతాల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఆరు మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 

click me!