శుభవార్త: అనుమతులిస్తే రెండేళ్ళలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ: గాలి జనార్ధన్ రెడ్డి

First Published Jun 25, 2018, 12:02 PM IST
Highlights

రెండేళ్ళలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఓకే చెప్పిన గాలి జనార్ధన్ రెడ్డి

కడప: కడపలో స్టీల్ ఫ్యాక్టకరీ ఏర్పాటుకు  అనుతులు మంజూరు చేస్తే రెండేళ్ళలోనే ఉత్పత్తిని మొదలు పెడతామని  బ్రహ్మణి స్టీల్స్ డైరెక్టర్ గాలి జనార్ధన్ రెడ్డి  ప్రకటించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అప్పటి ప్రభుత్వం బ్రహ్మణి స్టీల్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొంది.కానీ, 2009 తర్వాత  చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి బ్రహ్మణి స్టీల్ ఫ్యాక్టరీతో ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నారు. 

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో గాలి జనార్ధన్ రెడ్డి  ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. బ్రహ్మణి స్టీల్‌కు అన్నిరకాల అనుమతులు మంజూరు చేస్తే రెండేళ్ళలోనే ఫ్యాక్టరీని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించి మూడు ప్రతిపాదనలు చేశారు. బ్రహ్మణి స్టీల్స్‌ ఏర్పాటుకు వైఎస్‌ అన్ని రకాల అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆ జీవోలన్నింటినీ రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించి సహకరిస్తే రెండేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని  గాలి జనార్దనరెడ్డి తెలిపారు. 

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నా తమకు అంగీకారమే అన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుపై ఇప్పటిదాకా రూ.1350 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై కాగ్‌తో అధ్యయనం జరిపించాలని ఆయన సూచించారు. తాము పెట్టిన ఖర్చును చెల్లిస్తే పరిశ్రమను పూర్తిగా రాష్ట్రానికి అప్పగిస్తామన్నారు.  కేంద్రమే నేరుగా పరిశ్రమను ప్రారంభించ వచ్చని కూడా జనార్దనరెడ్డి ప్రతిపాదించారు. 

కర్ణాటకలోని బళ్లారి జిల్లా దోనిమలెలో 1.40 కోట్ల టన్నుల ఇనుప ఖనిజం మైనింగ్‌ జరుగుతోందన్నారు. కేంద్రం బ్రహ్మణిని స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఇనుప ఖనిజాన్ని తెప్పించుకుంటే కడపలో ఉక్కు పరిశ్రమ ప్రారంభించవచ్చని గాలి జనార్ధన్ రెడ్డి సూచించారు.బ్రహ్మణి అనే పేరు మార్చుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు.. దీనిని వెంటనే స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా వైజాగ్‌కు అప్పగించవచ్చని ఆయన  సూచించారు.

ప్రధానమంత్రి మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు తలచుకుంటే 24 గంటల్లో కడప జిల్లాలో బ్రాహ్మణి స్థానంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని జనార్దనరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధానమంత్రి మోడీకి లేఖలు పంపుతున్నట్టు ఆయన చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2007లో బ్రహ్మణి స్టీల్స్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొంది. 2009 తర్వాత వైఎస్ మరణం కారణంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు మార్పులు చోటు చేసుకొన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా  ఎన్నికైన తర్వాత  బ్రహ్మణి స్టీల్స్‌తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలుగా 2014లో విభజనకు గురైంది. అయితే విభజన హమీ చట్టంలో తెలంగాణలో బయ్యారం, ఏపీలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని  హమీ ఇచ్చారు. కానీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై ఇంతవరకు అతీగతీ లేకుండాపోయింది.  ఈ తరుణంలో టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆమరణ నిరహారదీక్షకు  చేస్తున్నారు. ఇవాళ్టికి సీఎం రమేష్ దీక్ష ఐదవ రోజుకు చేరుకొంది.
 

click me!