
విజయవాడ: చట్టం ప్రకారం, సంప్రదాయం ప్రకారం బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక జరుగుతుందని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ఆదివారం నాడు బ్రహ్మంగారి మఠంలో చోటు చేసుకొన్న వివాదంపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ విషయమై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బ్రహ్మంగారి మఠాధిపతిపై ప్రకటన చేసే వరకు నిర్వహణ బాధ్యతలను సీనియర్ అధికారులకు ఇచ్చామని ఆయన చెప్పారు. పీఠాధిపతి విషయంలో కుటుంబంలో వివాదం నెలకొందన్నారు. వారసుడి ఎంపిక విషయంలో ప్రతి ఒక్కరూ కూడ సంయమనం పాటించాలని మంత్రి కోరారు. పీఠం సంస్కృతి, సంప్రదాయాలు, గౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. పీఠాధిపతి ఎంపిక విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చారిత్రాత్మక పీఠంపై వివాదం చేయవద్దని మంత్రి తెలిపారు.
also read:బ్రహ్మంగారి పీఠం వారసుడి ఎంపికపై వివాదం: మరోసారి గ్రామానికి పీఠాధిపతులు, ఉద్రిక్తత
ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఎక్కడా కూడ ఎవరికీ అన్యాయం జరగదని ఆయన చెప్పారు. బ్రహ్మంగారి మఠం ఖ్యాతిని మంటగలిపే విధంగా వ్యవహరించొద్దన్నారు. ఈ విషయమై మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. వీలునామా రాసిన ప్రకారంగా దేవాదాయశాఖకు గానీ ధార్మిక పరిషత్ కు అందించాలని మంత్రి చెప్పారు. ఈ విషయమై బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంతవరకు ఎలాంటి వీలునామా తమకు అందలేదన్నారు. ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్టుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.