రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రకటించారు.ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకొన్న పరిణామాలు ప్రజాస్వామ్యస్పూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన చెప్పారు. దీంతోనే తాము ఎన్నికల బహిష్కరణకు నిర్ణయం తీసుకొన్నామన్నారు.
పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీ ఎలాంటి హింసకు పాల్పడిందో చూసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారో ఎస్ఈసీ, డీజీపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. కోర్టు విచారణలో ఉన్న సమయంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని ఈ నెల 2వ తేదీన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయాన్ని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై బహిరంగంగానే వ్యతిరేకించారు. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రు రాజీనామా చేశారు.