ఏపీకి ప్రత్యేక హోదా: జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్దం

By narsimha lodeFirst Published Jun 18, 2019, 2:39 PM IST
Highlights

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నామని ఆయన  వివరణ ఇచ్చారు

అమరావతి:   రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నామని ఆయన  వివరణ ఇచ్చారు.

మంగళవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విషయమై మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు.

2014 మార్చిలో నాటి ప్రధానమంత్రి  మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని... ప్రత్యేక హోదా ఇవ్వాలని తాము కేంద్రాన్ని కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ నేతలు కూడ హామీ ఇచ్చారని తాను గుర్తు చేశానని బాబు ప్రస్తావించారు.

అయితే  అదే సమయంలో   ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పిందని చంద్రబాబునాయుడు చెప్పారు.ప్రత్యేక హోదా ఇవ్వాలని  తాము కేంద్రంతో గొడవ పెట్టుకొన్నట్టుగా చెప్పారు. రాజ్యసభలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ప్రత్యేక హోదాను  ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని  కేంద్రం స్పష్టం చేసిందన్నారు. అయితే ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం  స్పష్టం చేసిందన్నారు. దీంతో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రస్తావించారు.

ఫైనాన్స్ కమిషన్ మాత్రం ప్రత్యేక హోదా పేరుకు ఒప్పుకోలేదన్నారు.  ఫైనాన్స్ కమిషన్ సూచన మేరకు ప్రత్యేక హోదాకు బదులుగా  ప్రత్యేక ప్యాకేజీ పేరు పెట్టారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాజకీయంగా  తాము నష్టపోయినా... ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేశామని  ఆయన చెప్పారు. 

ప్రత్యేక హోదా కోసం తాను సిన్సియర్‌గా పోరాటం చేసినట్టుగా  చంద్రబాబు చెప్పారు.ప్లానింగ్ కమిషన్‌కు వెళ్లి  ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పడం సరైంది కాదన్నారు. మీకు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు... ప్రత్యేక హోదా సాధించాలని జగన్ ను చంద్రబాబు కోరారు.  తనపై బురద చల్లితే ఏపీకి ప్రత్యేక హోదా రాదని  ఆయన అభిప్రాయపడ్డారు. తన కృషితోనే ఏపీలో ఏడు మండలాలను కలిపారని.... దీనివల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రసంగానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ కౌంటరిచ్చారు. చంద్రబాబునాయుడు ప్లానింగ్ కమిషన్ కు ఒక్క లేఖ కూడ రాయలేదన్నారు.  చంద్రబాబునాయుడు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోయిందని జగన్ వ్యాఖ్యానించారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ వచ్చే వరకు ప్రత్యేక హోదాపై తీర్మానం చేయని విషయాన్ని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు.

click me!