
కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలులో సొంత పెదనాన్నని ఓ వాలంటీర్ దారుణంగా చంపేశాడు. పొలం తగాదా నేపథ్యంలో ఈ గురువారం నాడు దారుణానికి ఒడిగట్టాడు. సదరు వాలంటీర్ను ప్రవీణ్ గా గుర్తించారు. అతను కర్నూలు మండలం నూతనపల్లె గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఆ గ్రామంలో వారి ఉమ్మడి కుటుంబానికి నాలుగెకరాల పొలం ఉంది. ఈ పొలం విషయంలో వచ్చిన తగాదాలోనే ఈ హత్య జరిగింది.
ప్రస్తుతం ఆ గ్రామంలో భూమిని రీ సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పెదనాన్న ఆరోగ్య స్వామి కుటుంబ సభ్యులు తమ కుటుంబానికున్న నాలుగు ఎకరాల భూమిని రీ సర్వే చేయించుకుని సమభాగాలు పంచుకుందామన్నారు. దీనికి వాలంటీర్ అయిన ప్రవీణ్ అంగీకరించలేదు. అప్పటినుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. మూడు నెలల కిందట దీనిమీద బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
తాజాగా ఇదే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర కోపానికి వచ్చిన ప్రవీణ్.. సోదరుడు రాజశేఖర్తో కలిసి కర్రలు, రాళ్లతో సొంత పెదనాన్న కుటుంబం అని కూడా చూడకుండా వారి మీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరోగ్య స్వామి(55) మృతి చెందాడు. ఆయన కుమారుడైన బాలస్వామికి తీవ్ర గాయాలయ్యాయి.
నాలుగో తరగతి గిరిజన బాలుడిని దారుణంగా హతమార్చింది సీనియర్లే.. !
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. తర్వాత.. ప్రవీణ్, అతనికి సహకరించిన సోదరుడు రాజశేఖర్.. వీరిద్దరి తల్లి మీద కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఓ వాలంటీర్ ఘాతుకం వెలుగు చూసింది. ఓ యువతీ వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలిసింది. నంద్యాల జిల్లా సున్నిపెంటలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…
సున్నిపెంట ఈస్ట్రన్ కాలనీలోని సచివాలయం వన్ లో ఎలకపాటి పవన్ కళ్యాణ్ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి అక్కడ ఓ యువతితో రెండేళ్ల క్రితం పరిచయమే ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. అలా సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు, అశ్లీల చిత్రాలు తీశాడు. అయితే, అవి ఇటీవల వేరే వ్యక్తి ద్వారా వెలుగు చూడడంతో కలకలం రేగింది.
ఆ వీడియోలు, ఫోటోలు తన స్నేహితులకు పంపినట్లుగా తేలింది. ఈ ఫోటోలు పవన్ కళ్యాణ్ స్నేహితుడైన రాంబాబు ద్వారా వెలుగు చూశాయి. యువతి కుటుంబ సభ్యుల దృష్టికి ఈ విషయం వెళ్ళింది. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. పవన్ కళ్యాణ్, రాంబాబుల మీద ఫిర్యాదు చేసింది. వారి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని విచారిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.