విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 29, 2024, 4:05 PM IST
Highlights

ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.  పూసపాటి వంశీయులదే విజయనగరంలో ఆధిపత్యం. విజయరామ గజపతి రాజు, అశోక్ గజపతిరాజులు ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చారు. అశోక్ గజపతి రాజు 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ , సోషలిస్ట్ పార్టీలు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, జనతా పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు జగన్  . తన కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న అశోక్ ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

విజయనగరం.. రాజులు, రాజవంశాలు ఏలిన గడ్డ. ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. రాజులు , రాచరికం అంతరించినా నేటి ప్రజాస్వామ్య కాలంలోనూ రాజులదే ఇక్కడ ఆధిపత్యం. ఈ రోజుల్లోనూ ఇక్కడ రాజులంటే భక్తి అలాగే వుంది. ఎన్నికల సమయంలోనూ ఇది బాగా కనిపిస్తుంది. విశ్వవిఖ్యాతిని ఆర్జించిన మహానుభావులకు విజయనగరం నిలయం.

ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. మరెందరో కవులు, కళాకారులు, విద్యావేత్తలు రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలందించారు. విజయనగరంలోని రాజవంశాలు కాలక్రమేణా పలు పార్టీలకు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా పూసపాటి వంశీయులదే విజయనగరంలో ఆధిపత్యం. విజయరామ గజపతి రాజు, అశోక్ గజపతిరాజులు ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చారు. 

విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పూసపాటి వంశీయుల అడ్డా :

1952లో ఏర్పడిన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజు తండ్రి విజయరామ గజపతిరాజు చరిత్రలో నిలిచిపోయారు. ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి ఒకసారి, ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కుమారుడు అశోక్ గజపతి రాజు 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు. 1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి గెలిచిన అశోక్.. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 1999 వరకు డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మధ్యలో ఆయన జోరుకు కోలగట్ల వీరభద్ర స్వామి బ్రేక్ వేసినా తిరిగి 2009లో అశోక్ గెలుపొందారు. 

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,31,554 మంది. ఈ సెగ్మెంట్ పరిధిలో విజయనగరం పట్టణం వుంటుంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ , సోషలిస్ట్ పార్టీలు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, జనతా పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. అశోక్ గజపతి రాజుతో కే వీరభద్ర స్వామి చిరకాలంగా పోరాడుతున్నారు. 2004లో తొలిసారిగా రాజుగారిని ఓడించి విజయనగరం ఖిల్లా రికార్డును స్వామి బద్ధలుకొట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా బరిలో దిగిన వీరభద్ర స్వామికి 78,849 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు 72,432 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 6,400 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా విజయనగరం కోటపై జెండా పాతింది. 

విజయనగరం శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. రాజుల ఖిల్లాలో పట్టు నిలుపుకోవాలని జగన్ :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. రాజుల కంచుకోటలో తన పట్టు నిలుపుకోవాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు కంటే ఈ సీటును అశోక్ గజపతి రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న ఆయన ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా కలిసి రావడంతో, పూసపాటి బ్రాండ్ ఇమేజ్‌తో ఈసారి విజయం సాధిస్తానని అశోక్ ధీమాగా వున్నారు. 

click me!