టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి పోలీసులు.. నర్సీపట్నంలో మరోసారి ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jun 23, 2022, 9:59 PM IST
Highlights

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు రావడంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. 

అనకాపల్లి జిల్లా (anakapalle district) నర్సీపట్నంలో (narsipatnam) మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ (tdp) సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి గురువారం రాత్రి విశాఖ సిటీ పోలీసులు వెళ్లారు. అయ్యన్నపాత్రుడికి సెక్షన్‌ 41కింద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రాగా... ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగారు. చోడవరం మినీ మహానాడులో అయ్యన్నపాత్రుడు.. రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారని 5 రోజుల క్రితం గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆరోజు ఆయన ఇంటి వద్ద లేకపోవడంతో వెనుదిరిగారు. అయ్యన్నపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని, ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే.. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించి అయ్యన్నపాత్రుడికి (ayyanna patrudu) హైకోర్టులో (ap high court) ఊరట లభించిన సంగతి తెలిసిందే. డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ఇటీవల కూల్చివేశారు. దీంతో ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

ALso Read:అయ్యన్న ఇంటిని కూల్చివేత... ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

దీనిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పీవీ సతీష్ తెలిపారు. రాజకీయ కక్షతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని ఆయన వాదించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బంది.. ప్రహరీని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు. అయ్యన్న స్పందించకపోవడంతోనే ప్రహరీ గోడ కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. అయితే కూల్చివేతను అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 

click me!